గన్నవరం భగభగ.. వైసీపీలో వల్లభనేని వంశీ సెగ

  • Publish Date - August 25, 2020 / 08:35 PM IST

15 రోజుల్లో గన్నవరం నియోజకవర్గ ప్రజలు శుభవార్త వింటారు.. సీఎం జగన్ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటి చేస్తాను. వైకాపా రాష్ట్ర పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ మెంబర్ దుట్టా రామచంద్రావు చెబుతున్న మాటలివి. మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని వెంట పెట్టుకుని సీఎం కాళ్లు పట్టుకున్నారో ఏమో తెలియదు కానీ వల్లభనేని వంశీ వైసీపీలోకి వచ్చారు.

ఎలాంటి తాటాకు చప్పుళ్లకు తాను బెదరబోనని, నిన్న కాక మొన్న వచ్చి ఆయన.. తమ నాయకులపై, కార్యకర్తలపై పెత్తనం చేస్తే సహించేది లేదని, దేనికైనా సిద్ధమేనని అంటున్నారు. ఊపిరి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డితో నడుస్తానని స్పష్టం చేశారు.



దుట్టా రామచంద్రరావుతో తనకు విభేదాలు లేవని, తానే ఎమ్మెల్యే, పార్టీ ఇన్‌చార్జినని శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ చేసిన వ్యాఖ్యలు గన్నవరంలో కలకలం రేపాయి. వీటిపై వైసీపీ సీనియర్ నాయకుడు దుట్టా రామచంద్రరావు వర్గం మండి పడుతోంది.

వంశీ కారణంగా అసలైన వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం దుట్టా వద్దకు వెళ్లి తాను నిర్వహిస్తోన్న గ్రామసభలకు హాజరుకావాలని వంశీ ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని తిరస్కరించిన దుట్టా.. తాను సీఎం జగన్ వద్ద తేల్చుకున్నాకే మాట్లాడతానని స్పష్టం చేశారు.

మరోవైపు ఇప్పటి వరకూ యార్లగడ్డ వర్గాన్ని దూరం పెట్టిన దుట్టా వర్గీయులు ఇపుడు దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేపట్టారు. రెండు వర్గాలూ ఏకమైతే వంశీని ఒంటరిని చేయవచ్చన్నది దుట్టా వ్యూహంగా కన్పిస్తోందని అంటున్నారు. దుట్టా, వంశీ వర్గాల ఆధిపత్య పోరు నేపథ్యంలో శుక్రవారం ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది.



పశుసంవర్థక శాఖ మంత్రి అప్పలరాజు దుట్టా రామచంద్రరావును ఆయన ఇంట్లో కలిశారు. దుట్టా నివాసం ఉండే వీధిలోనే వైసీపీ నాయకులు విజయనాయుడు ఇంటి దగ్గర వంశీ కార్యకర్తలను కలుసుకునే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రెండూ ఒకే సమయంలో జరిగాయి. దుట్టా ఇంటికి అనుచరులు అతి కొద్ది మందే హాజరయ్యారు. విజయ నాయుడు ఇంటి దగ్గర మాత్రం వంశీ కోసం పెద్ద ఎత్తున కార్యకర్తలు వేచి ఉన్నారు.

నిన్నటి వరకూ దుట్టాను అంటి పెట్టుకున్న వారు విజయనాయుడు ఇంటి వద్ద వంశీ కోసం ఎదురు చూడటం చర్చనీయాంశమైంది. దుట్టా ఇంటి నుంచి మంత్రి వెళుతున్న సమయంలో వంశీ కారుకు అడ్డుపడ్డారు. వంశీ కారు దిగి మంత్రికి అభివాదం చేశారు. మంత్రి కూడా వంశీని పలకరించారు.

ఈ పరిణామం నియోజకవర్గంలో సంచలనంగా మారింది. గన్నవరం వైసీపీలో తన అల్లుడు శివభరత్ రెడ్డిని వైసీపీ నేతగా తీర్చిదిద్దేందుకు దుట్టా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారని టాక్‌. ఇది జరగాలంటే వంశీ బలహీనం కావాలి. దీనికి అనుగుణంగా దుట్టా పావులు కదుపుతున్నారట.



అందులో భాగంగానే వైసీపీ పెద్దలను దుట్టా, ఆయన అల్లుడు శివభరత్ రెడ్డి తరచూ కలుస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వంశీ వర్గానికి సమాంతరంగా తనదైన మరో వర్గాన్ని పెంచి పోషిస్తున్నారని టాక్‌.

ప్రస్తుతం వైసీపీకి గన్నవరం తలనొప్పిగా మారే అవకాశంమే కనిపిస్తోంది. అతి త్వరలోనే ఈ పంచాయతీ జగన్ వరకూ వెళ్లేలా ఉంది. ఆరంభం నుంచీ గన్నవరంలో వైసీపీకి దుట్టా పెద్దగా ఉన్నారు. నియోజకవర్గ కేడర్‌కు అండగా ఉన్నారు. జగన్ కుటుంబానికి సన్నిహితులు కూడా. గత ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల దుట్టా తప్పుకొని యార్లగడ్డకు సీటు కేటాయించాల్సి వచ్చింది.



ఈలోగా వంశీ టీడీపీని వీడటంతో పరిస్థితులు మారాయి. దీంతో దుట్టా.. వంశీల మధ్య ప్రత్యక్ష పోరు నెలకొంది. దీన్ని ఎలా అధిష్టానం పరిష్కరిస్తుందో చూడాలని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పార్టీని బలోపేతం చేయాలంటే నాయకులు ఒకటి కావాలని అంటున్నారు. కానీ, దుట్టా, వంశీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. మరి వీటిని వైసీపీ పెద్దలు.. ముఖ్యంగా జగన్‌ ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.