పోలీస్ ప్రమోషన్లపై చర్చకు సిధ్ధం : చినరాజప్ప

  • Publish Date - February 5, 2019 / 10:26 AM IST

అమరావతి : ఏపీ పోలీసు శాఖలో ప్రమోషన్ల విషయంపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం చర్చకు సిధ్ధంగా ఉందని ఏపీ హోం మంత్రి చిన రాజప్ప  చెప్పారు.
సీఎం తీసుకున్న నిర్ణయాలు అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్నవని ఆయన అన్నారు. సీఎం కు వస్తున్న ఆదరణ తట్టుకోలేక, ఎన్నికల్లో గెలవననే భయంతోనే  జగన్ పోలీసులు మీద ఫిర్యాదు చేస్తున్నారని రాజప్ప ఆరోపించారు.  డీజీపీ శాంతి భద్రతలు కాపాడటంలో ముందున్నారని, జగన్ ప్రమోషన్స్ మీద అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.  

“విభజన తర్వాత కూడా రెండు రాష్ట్రాలకు పదోన్నతులు ఆంధ్రలోనే ఇచ్చారు. 350 పోస్టుల్లో 252 పోస్టులకు  విభజన  తర్వాత పదోన్నతులు ఇచ్చారు.  పదోన్నతులలో రిజర్వేషన్లు ఖచ్చితంగా  పాటించాల్సిదే. 91 రెగులర్  డీఎస్పీ పోస్టుల్లో ఓసీ లకు 31, బీసీలు 30, ఎస్సిలకు6 , ఎస్టీలకు 4, ముస్లింలకు 5 , ఖాళీలు 9 ఉన్నాయి.  ఒకే సామాజిక వర్గానికి పదోన్నతులు ఇచ్చాము” అనడం సరికాదని  మంత్రి వివరించారు.  

“రోస్టర్ పాటించి పదోన్నతులు ఇచ్చాము…, ఎక్కడ ఎవరికి పదోన్నతులు ఇచ్చామో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.  సీఎం అవ్వలేను అనే భయంతో జగన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు”  అని  చినరాజప్ప అన్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్  వస్తే అధికారులు అంత ఎన్నికల సంఘం పరిధిలోనే  పని చేస్తోంది, ప్రమోషన్లపై శ్వేత పత్రం విడుదల చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని ఆయన తెలిపారు. జగన్ ను కేసుల  నుంచి బయట పడేయడానికి మోడీ ప్రయత్నిస్తున్నారని  రాజప్ప ఆరోపించారు.