×
Ad

Vivek Venkatswamy: పంతానికి పోయి కారు మైలేజ్ పెంచుతున్నారా? వివేక్‌, మల్‌రెడ్డి తీరుపై సొంత పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నారా?

మెజార్టీ మున్సిపాలిటీల‌ను కైవ‌సం చేసుకున్న ఆనందం కాస్త.. ఈ రెండు చోట్ల చోటు చేసుకున్న ప‌రిణామాలు నిరుత్సాహానికి గురి చేస్తున్నాయ‌ట.

  • Published On : February 20, 2026 / 11:43 PM IST

Vivek Venkatswamy Representative Image (Image Credit To Original Source)

  • ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లి మున్సిపల్‌ పీఠాలపై వీడని ఉత్కంఠ
  • రెండు చోట్ల బీఆర్ఎస్‌కు మెజార్టీ.. పంతానికి పోతున్న కాంగ్రెస్ నేతలు
  • క్యాతన్‌పల్లిలో 7 సీట్లతో సరిపెట్టుకుని ఛైర్మన్‌ పీఠం కోసం పట్టు
  • ఇబ్రహీంపట్నంలో 8 స్థానాలకే పరిమితమై..పట్టువదలని మల్‌రెడ్డి
  • వివేక్‌, మల్‌రెడ్డి తీరుపై హస్తం పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నారా?

 

Vivek Venkatswamy: పట్టుబట్టారు. పైచేయి సాధించారు. కొన్నిచోట్ల మ్యాజిక్ ఫిగర్ సీట్లు రాకపోయినా..చక్రం తిప్పి కాంగ్రెస్ జెండా పాతేశారు. కానీ రెండు మున్సిపల్ ఛైర్మన్‌ పీఠాల విషయంలో..ఇద్దరు ముఖ్యనేతల తీరు..హస్తం పార్టీ లీడర్లకే నచ్చట్లేదట. ఆ రెండు చోట్ల ఫ‌లితం తేల‌క‌పోగా..గొడ‌వ‌ల‌తో ప్రజ‌ల్లో ప‌లుచ‌న కావాల్సి వ‌స్తుందని గుర్రుగా ఉన్నార‌ట‌. ఇద్దరు కీలక నేత‌లు పంథాల‌కు పోయి..పార్టీని, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నార‌ని గొణుక్కుంటున్నారట హస్తం పార్టీ పెద్దలు. ఇంత‌కు ఎవ‌రా ఇద్దరు నేత‌లు? ఆ రెండు చోట్ల రచ్చకు కారణమేంటి?

116 మున్సిపాలిటీల‌కు, ఏడు కార్పొరేష‌న్లకు ఎన్నిక‌లు జ‌రిగాయి. పొత్తులు, లాబీయింగ్‌లు, నయానో బయానో..దాదాపు వంద మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేష‌న్లను తమ ఖాతాలో వేసుకుంది హస్తం పార్టీ. ఇబ్రహీంప‌ట్నం, క్యాత‌న్‌ప‌ల్లి, ఖానాపూర్‌లో మాత్రం పాల‌క‌వ‌ర్గాలు కొలువు దీర‌లేదు. ఈ మూడు మున్సిపాలిటీల‌లో రెండు చోట్ల జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు.

ఇబ్రహీంప‌ట్నం, క్యాత‌న్‌ప‌ల్లి.. రెండు చోట్ల రచ్చరంబోలా అయి హాట్ టాపిక్‌గా మారాయి సిచ్యువేషన్స్. ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లిలో బీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ ఉన్నా..కాంగ్రెస్‌ నేతలు పట్టుదలకు పోయి వివాదానికి దారి తీశారని హస్తం పార్టీలోనే చర్చ జరుగుతోందట. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లి మున్సిపల్ రాజకీయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నార‌ట‌. మెజార్టీ మున్సిపాలిటీల‌ను కైవ‌సం చేసుకున్న ఆనందం కాస్త.. ఈ రెండు చోట్ల చోటు చేసుకున్న ప‌రిణామాలు నిరుత్సాహానికి గురి చేస్తున్నాయ‌ట. ఇబ్రహీంపట్నం, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల‌ను కైవ‌సం చేసుకోవ‌డంలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి వ్యవ‌హ‌రిస్తున్న తీరుతో ప్రజ‌ల్లో చుల‌క‌న అవుతున్నామ‌నే భావ‌న‌తో ఉన్నార‌ట‌ కాంగ్రెస్ పెద్దలు.

క్యాత‌న్‌ప‌ల్లి మున్సిపాలిటీ మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్ ప‌రిధిలోనిది. ఇక ఇబ్రహీంప‌ట్నం మున్సిపాలిటీ..సీనియ‌ర్ ఎమ్మెల్యే మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గ హెడ్ క్వార్టర్‌. ఈ రెండు చోట్ల బీఆర్‌ఎస్‌కు ఛైర్మన్ పీఠానికి కావాల్సిన మెజార్టీ వచ్చింది. క్యాత‌న్‌ప‌ల్లిలో బీఆర్‌ఎస్‌..సీపీఐ పొత్తు పెట్టుకొని మొత్తం 22 వార్డుల‌కు గాను..14 స్థానాలు గెలుచుకున్నాయి. ఇందులో బీఆర్‌ఎస్ 10, సీపీఐ 4 వార్డులు సొంతం చేసుకున్నాయి. ఇక్కడ అధికార కాంగ్రెస్ 7 వార్డుల‌కే ప‌రిమిత‌మైంది. మంత్రి వివేక్ నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో.. మంత్రి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎట్టి ప‌రిస్థితిలో మున్సిపాలిటీని కైవ‌సం చేసుకోవాల‌నే ఆలోచ‌న‌తో రంగంలోకి దిగారు.

బాల్క సుమన్ అరెస్ట్ తో కాంగ్రెస్ కు నెగిటీవ్..

మున్సిపాలిటీలో మెజారిటీ లేక‌పోవ‌డంతో ఎక్స్ అఫిషియోగా, స్థానిక ఎమ్మెల్యేగా వివేక్‌, అలాగే ఎంపీగా ఉన్న వివేక్ కుమారుడు గ‌డ్డం వంశీ కూడా అక్కడే ఓటు న‌మోదు చేసుకున్నారు. దీంతో మొత్తం 24 ఓట్లకు మ్యాజిక్ ఫిగ‌ర్ 13కు చేరుకుంది. బీఆర్‌ఎస్‌, సీపీఐకి క‌లిసి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయినా స‌రే ఎట్టి ప‌రిస్థితిల్లో కాంగ్రెస్ జెండా ఎగుర‌వేయాల‌నే ఆలోచ‌న‌తో మంత్రి వివేక్ రంగంలోకి దిగారు. దీంతో అక్కడ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ తీవ్రంగా ప్రతిఘ‌టించారు.

వివాదం రోజు రోజుకు ముదిరింది. తోపులాటలు, లాఠీచార్జ్‌లు..రచ్చరచ్చ అయి స్టేట్‌వైడ్‌గా చర్చకు దారితీశాయి. దీంతో ప్రభుత్వ పెద్దలు మంత్రి వివేక్ వ్యవహరిస్తున్న తీరుపై అస‌ంతృప్తిగా ఉన్నారట. బాల్క సుమ‌న్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపితే..మాజీ మంత్రి హ‌రీష్ రావు పరామర్శకు వెళ్లడంతో ప‌రిణామాలు పూర్తిగా కాంగ్రెస్‌కు నెగిటీవ్‌గా మారాయని భావిస్తున్నారట. మంత్రి వివేక్ పంథం కార‌ణంగా ప్రభుత్వానికి, పార్టీకి బ్యాడ్ నేమ్‌ వ‌స్తుంద‌నే భావ‌న‌లో ప్రభుత్వ పెద్దలు ఉన్నార‌ట‌.

ఇక ఇబ్రహీంప‌ట్నం మున్సిపాలిటీ ప‌రిస్థితి కూడా ఇంచు మించు ఇదే ప‌రిస్థితి. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోకే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేప‌ట్టిన ప్యూచ‌ర్ సిటీ వ‌స్తోంది. ప్యూచ‌ర్ సిటీ ఉండే ఇబ్రహీంప‌ట్నం అధికార కాంగ్రెస్‌కు కాకుండా..ప్రతిప‌క్ష బీఆర్‌ఎస్ జెండా ఎగ‌ర‌డం ఏ మాత్రం స‌మంజ‌సం కాద‌ని స్థానిక ఎమ్మెల్యే మ‌ల్ రెడ్డి రంగారెడ్డి ప‌రువు కోసం గ‌ట్టి ప‌ట్టుప‌డుతున్నారు. ఇక్కడ 24 వార్డుల‌కు గాను బీఆర్‌ఎస్ 13 స్థానాలు గెలుచుకొని సింగిల్‌గా మున్సిపాలిటీని కైవ‌సం చేసుకుంది. కాంగ్రెస్ 8 స్థానాల‌కే ప‌రిమిత‌మైంది.

చికాకు పడుతున్న ప్రభుత్వ పెద్దలు..

ఎట్టి ప‌రిస్థితిలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగుర‌వేయాల‌ని ఎమ్మెల్యే మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి వ్యూహాల‌కు ప‌దును పెట్టారు. కానీ ఎమ్మెల్యే వ్యూహాలు లోక‌ల్‌గా పెద్ద వివాదానికి దారితీస్తున్నాయి. హైకోర్టు దాకా వెళ్లడం..అనేక నాట‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో మున్సిప‌ల్ పాల‌క‌వ‌ర్గం ఎన్నిక వాయిదా ప‌డింది. ఈ ఎపిసోడ్ మొత్తంలో అధికార పార్టీ బ్లేమ్ కావాల్సి వ‌చ్చింది. దీంతో ప్రభుత్వ పెద్దలు కాస్త చికాకుప‌డుతున్నార‌ట‌.

మున్సిపాలిటీల‌ను కైవ‌సం చేసుకోవాలంటే స్మూత్‌గా డీల్ చేయాల్సింది పోయి..అన‌వ‌స‌రంగా ర‌చ్చకు దారి తీసి..విప‌క్షానికి పొలిటిక‌ల్ మైలేజ్ పెంచుతున్నారని తీవ్ర అస‌హ‌నం వ్యక్తం చేస్తున్నారట. వాస్తవానికి చాలా చోట్ల హంగ్ వ‌చ్చినా.. కొన్ని చోట్ల బీఆర్‌ఎస్ మెజారిటీ సాధించినా..కాంగ్రెస్ నేతలు తెరవెనుక ప్రయత్నాలు చేసి ఛైర్మన్ పీఠాలు సొంతం చేసుకున్నారు. ఆమ‌న్ గ‌ల్ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ పూర్తి మెజారిటీ సాధించినా..అక్కడ వార్డుతో సరిపెట్టుకున్నా..ఊహించ‌ని ట్విస్ట్‌ల‌తో ఆమ‌న్‌గ‌ల్ మున్సిపాలిటీని హస్తగతం చేసుకున్నారు.

జనగామ, తొర్రూరు మున్సిపాలిటీలను అయితే లక్కీ దాగా లాగ కలిగి..పంతం నెగ్గించుకొని పైచేయి సాధించారు కాంగ్రెస్ నేతలు. కానీ ఇబ్రహీంప‌ట్నం, క్యాత‌న్‌ప‌ల్లి ఎపిసోడ్‌ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా చ‌ర్చనీయాంశంగా మారింది. మున్సిపల్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించినా..ఈ రెండు చోట్ల చోటు చేసుకున్న పరిణామాలతో ఆనందం లేకుండా పోయిందని ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. వాయిదా ప‌డిన క్యాత‌న్‌ప‌ల్లి, ఇబ్రహీంప‌ట్నం మున్సిపాలిటీల విష‌యంలో ఏం జ‌రుగుతుంద‌నేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇంత రచ్చ జరిగి..న్యూస్‌ హెడ్‌లైన్‌ మారిన ఆ రెండు మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నికకు ఎలా ఎండ్‌ కార్డ్ పడనుందనేది సస్పెన్స్‌గా మారింది.

Also Read: ఎంఐఎంతో జాగ్రత్త..! రాహుల్‌ కామెంట్స్ వెనుక మర్మమేంటి? సడెన్‌గా ఏమైంది?