Statue Politics: ఎన్టీఆర్ విగ్రహావిష్కరణతో పాలిటిక్స్‌లో ట్విస్టులు..! తెలంగాణవాదులు ఎత్తుకున్న కొత్త నినాదమేంటి..

హైదరాబాద్ నడిబొడ్డున ఎన్టీఆర్‌, బాలు విగ్రహాలను ఏర్పాటు చేయటం ద్వారా.. రాష్ట్రాలు వేరైనా మనమంతా ఒక్కటే అనే భావనను తెలంగాణ సీఎం రేవంత్ కలిగించారని..

  • Published on- May 30, 2026 / 10:31 PM IST
  • ఎన్టీఆర్ విగ్రహావిష్కరణతో పాలిటిక్స్‌లో ట్విస్టులు!
  • తెలంగాణవాదుల తీరులో యూటర్న్ కనిపిస్తోందా?
  • వాళ్ల ఆలోచనల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందా?
  • తెలంగాణవాదుల ఎత్తుకున్న కొత్త నినాదమేంటి ?
  • విగ్రహాలకు, రాజకీయాలకు లింక్ కనిపిస్తోందా ?

Statue Row: హైదరాబాద్ అమీర్‌పేట్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. తెలంగాణ రాజకీయాలను మలుపులు తిప్పుతుందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ప్రతిమకు, పాలిటిక్స్‌కు సంబంధం ఏంటి అనుకుంటున్నారా.. అలానే ఉంది సీన్ మరి! ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతం పేరు చెప్తే చాలు వ్యతిరేకించిన తెలంగాణవాదులు.. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారా? వాళ్ల ఆలోచనల్లో మార్పు కనిపిస్తోందా.. తెలంగాణవాదులు ఎత్తుకున్న కొత్త నినాదమేంటి.. దానికి కారణాలు ఏంటి..

రాష్ట్ర విభజనకు ముందు.. విభజన తర్వాత.. తెలుగు రాష్ట్రాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది అనేది కాదనలేని సత్యం. ఇప్పటికీ తెలంగాణలో సెంటిమెంట్ రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయ్‌. విడిపోయినా సరే.. వివాదాలు ఆగడం లేదు. ఏపీ, తెలంగాణ మధ్యలో.. నీటి పంపకాల కాంట్రవర్సీ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ జల వివాదాలు తెలంగాణ రాజకీయ పార్టీలకు.. అస్త్రంగా మారుతూనే ఉన్నాయ్‌. ఇలాంటి తరుణంలో తెలంగాణవాదుల నుంచి కొత్త ప్రపోజల్ తెరపైకి వచ్చింది. ఇదే ఇప్పుడు రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తోంది.

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ తర్వాత తెలంగాణవాదుల కొత్త ప్రతిపాదన..

ఆంధ్ర ప్రాంతానికి చెందిన మహనీయుల విగ్రహాలను.. ఇక్కడ కూడా పెడుతోంది తెలంగాణ సర్కార్‌.. రవీంద్రభారతిలో ప్రముఖ గాయకుడు బాల సుబ్రహ్మణ్యం విగ్రహాన్ని.. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆవిష్కరించింది. ఈ విగ్రహావిష్కరణ సమయంలో ప్రభుత్వంపై తెలంగాణవాదులు తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని.. రవీంద్రభారతిలో ఎందుకు పెడుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రశ్నించారు. ఆ వివాదంపై ఇప్పటికీ చర్చ జరుగుతుండగానే.. అమీర్‌పేట్‌ సర్కిల్‌లో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లారు. ఐతే అప్పుడు బాలు విగ్రహం టైమ్‌లో ఎదురైన విమర్శలే.. ఇప్పుడూ వస్తాయని అనుకున్నారట అంతా ! ఐతే దీని మీద పెద్దగా ఎలాంటి విమర్శలు రాలేదు. పైగా తెలంగాణవాదులు కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు.

తెలంగాణకు మహనీయుల విగ్రహాలను ప్రతిష్టించాలనే ప్రపోజల్..

ఏపీకి చెందిన బాలు, ఎన్టీఆర్ విగ్రహాలను తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ప్రతిష్టించారని.. అలాగే తెలంగాణకు చెందిన మహనీయుల విగ్రహాలను ఏపీ సర్కార్‌ ప్రతిష్టించాలనే ప్రపోజల్ పెడుతున్నారట తెలంగాణవాదులు. కళలకు, రాజకీయాలకు ప్రాంతీయ విబేధాలు ఉండవని కీలక సూచనలు చేస్తున్నారట. మాజీ ప్రధాని పీవీతో పాటు జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత సినారె, కవి కాళోజీ, తెలంగాణకు చెందిన నటులు కాంతారావుతో పాటు.. భాగవతాన్ని తెలుగీకరించిన బమ్మెర పోతన విగ్రహల ఏర్పాటుకు సహకరించాలని కోరుతున్నారట. అమరావతిలో కృష్ణా నది ఒడ్డున, సచివాలయ పరిసరాల్లో ఈ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ.. తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ సీఎం చంద్రబాబు లేఖ కూడా రాశారట. తెలంగాణ కవులు, కళాకారులు, సాహితీవేత్తలు వేయి మందిమి వచ్చి.. విగ్రహాలు తెచ్చి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చేతుల మీదుగా ప్రతిష్టించుకుంటామని.. ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు రాణి రుద్రమ.

ఏపీలోనూ స్థలం చూపిస్తే తెలంగాణ వైతాళికుల విగ్రహాలు..

హైదరాబాద్ నడిబొడ్డున ఎన్టీఆర్‌, బాలు విగ్రహాలను ఏర్పాటు చేయటం ద్వారా.. రాష్ట్రాలు వేరైనా మనమంతా ఒక్కటే అనే భావనను తెలంగాణ సీఎం రేవంత్ కలిగించారని.. అలానే ఏపీలోనూ స్థలం చూపిస్తే తెలంగాణ వైతాళికుల విగ్రహాలు ఏర్పాటు చేసి ఆ స్ఫూర్తిని కొనసాగిస్తామంటూ రాణి రుద్రమ అంటున్నారు. గతంలో ఆంధ్ర ప్రాంతం నీడను కూడా వ్యతిరేకించే తెలంగాణవాదులు.. ఇప్పుడు ఇలాంటి కొత్త ప్రపోజల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి ఏపీ సర్కార్ ఈ విషయంలో ముందుకు వస్తుందా లేదో చూడాలి. ఒకవేళ ముందుకు వస్తే మాత్రం.. రెండు రాష్ట్రాల మధ్య గ్యాప్ తగ్గడం ఖాయం అనే వాదనలు వినిపిస్తున్నాయ్‌.

Also Read: పెద్దల సభకు షర్మిల? ఇందులో నిజమెంత, కర్ణాటక నుంచే ఎందుకు?