Minister Harish Rao satires on BJP government
Harish rao slams centre: వ్యవసాయ రంగంపై కేంద్ర ప్రభుత్వం దిశానిర్దేశం లేకుండా పనిచేస్తోందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. బియ్యం, నూకల ఎగుమతులపై నిషేధం ఎందుకు విధించారని ఆయన నిలదీశారు. వరి ఎగుమతిపై 20 శాతం సుంకం విధించడం ఏంటని ప్రశ్నించారు. పఠాన్‌చెరులో ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ… దేశంలో ఆహార నిల్వలు తగ్గిన సమయంలో నిషేధం పెడుతారని, మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారని నిలదీశారు.
ఆహార భద్రతకు భరోసా లేకుండా కేంద్ర ప్రభుత్వ తీరు ఉందని హరీశ్ రావు అన్నారు. కేంద్ర సర్కారు అసమర్థత వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నాని ఆయన తెలిపారు. దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని అన్నారని, ఆ హామీ ఏమైందని హరీశ్ రావు నిలదీశారు. ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని చెప్పారు. దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా అవతరించిందని అన్నారు. తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాలో 65 లక్షల ఎకరాల్లో వరి పండిందని హరీశ్ రావు అన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చిందని చెప్పారు.