హుజూర్ నగర్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ.. అభ్యర్థిని ప్రకటించింది. తెలంగాణ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఉత్తమ్ పద్మావతి రెడ్డి పేరుని కాంగ్రెస్ ఖరారు చేసింది. ఉప
హుజూర్ నగర్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ.. అభ్యర్థిని ప్రకటించింది. తెలంగాణ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఉత్తమ్ పద్మావతి రెడ్డి పేరుని కాంగ్రెస్ ఖరారు చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతి రెడ్డి బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా సైదిరెడ్డిని ప్రకటించిన సంగతి తెలిసిందే.
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూర్ నగర్ స్థానం ఖాళీ అయ్యింది. హుజూర్ నగర్ ఉపఎన్నికలో గెలుపుపై అన్ని పార్టీలు కన్నేశాయి. ఎలాగైనా హుజూర్ నగర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని అధికార పార్టీ సహా.. బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కాబట్టి.. తామే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు నమ్మకంగా ఉన్నారు.
2018 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కోదాడ నుంచి ఉత్తమ్ పద్మావతి, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. కోదాడలో పద్మావతి ఓడిపోయారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ-టీజేఎస్ కలిసి పోటీ చేశాయి. కూటమికి ఘోర పరాజయం ఎదురైంది. టీఆర్ఎస్ 88 సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి 19మంది గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టడంతో మూడింట రెండు వంతులకు పైగా ఎమ్మెల్యేలు కారెక్కారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో విలీనం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మరొకరిని బరిలోకి దింపే కంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యను బరిలోకి దింపాలని టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. బయట నుంచి నేతను తీసుకొచ్చి బరిలోకి దింపితే.. స్థానికంగా వ్యతిరేక ప్రభావం వచ్చే అవకాశం ఉందని భావించి ఉత్తమ్ భార్య పద్మావతిని పోటీకి నిలిపింది.