If we give 18k crores, we will withdraw from the by election says Minister Jagdish Reddy
Jagdish Reddy: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక నుంచి తప్పుకుంటామని మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలు ఇస్తే ఎన్నికకు దూరంగా ఉంటామని ఆయన అన్నారు. రాజగోపాల్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంత మొత్తం ఇస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ను ఒప్పిస్తానని అన్నారు. సోమవారం మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన.. భారతీయ జనతా పార్టీకి పై విధంగా సవాలు విసిరారు.
‘‘తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికే ఈ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. రాజకీయాల కోసమే ఉప ఎన్నిక సృష్టించారు. ఒక వ్యక్తి కోసం 18,000 కోట్ల రూపాయలు ఇవ్వడం ఏంటి? ఆయనకిచ్చే సొమ్ము జిల్లా అభివృద్ధికి ఇవ్వండి. మోదీ, అమిత్ షా అలా చేస్తే మునుగోడు ఉప ఎన్నిక నుంచి మేం తప్పుకుంటాం. అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రాధేయపడైనా సరే నేనే ఒప్పిస్తా’’ అని జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రానికి అనేక సార్లు వచ్చిన మోదీ, అమిత్ షా సహా ఇతర బీజేపీ నేతలు ఏనాడూ ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు.
రాష్ట్ర అభివృద్దికి పైసా ఇవ్వని వారు, పార్టీ మారిన వ్యక్తికి మాత్రం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ అంటేనే రాజకీయ నేతల్ని అంగట్లో పెట్టి వ్యాపారం చేసే పార్టీయని, ఇతర రాష్ట్రాల్లో వేరే పార్టీల నేతల్ని కొంటూ బీజేపీ ప్రభుత్వాల్ని ఏర్పాటు చేస్తున్న ఉదంతాలు కళ్లెదురుగా కనిపిస్తూనే ఉన్నాయని జగదీష్ రెడ్డి విమర్శించారు. మునుపెన్నడూ లేని విధంగా నల్గొండ జిల్లా అభివృద్ధి చెందిందని అన్న ఆయన.. రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు.