AIADMK BJP: బీజేపీకి షాక్.. ఎన్డీయేతో పొత్తు తెంచుకున్నట్లు అధికారికంగా ప్రకటించిన అన్నాడీఎంకే

తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తీరు వల్లనే ఇరు పార్టీల పొత్తు తెగిపోయినట్లు కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ.. చాలా కాలంగా ఇరు పార్టీల మధ్య అంతటి సఖ్యత లేదు. దీంతో ఇరు పార్టీల స్నేహం ఎట్టకేలకు పటాపంచలైంది.

AIADMK BJP Alliance: భారతీయ జనతా పార్టీతో పొత్తు తెంచుకుంటున్నట్లు తమిళ పార్టీ అన్నాడీఎంకే సోమవారం అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి పొత్తు తెంచుకుంటామని గతంలోనే చెప్పటినప్పటికీ, ఈరోజు పార్టీ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై (Tamil Nadu BJP president K Annamalai) తీరు వల్లనే ఇరు పార్టీల పొత్తు తెగిపోయినట్లు కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ.. చాలా కాలంగా ఇరు పార్టీల మధ్య అంతటి సఖ్యత లేదు. దీంతో ఇరు పార్టీల స్నేహం ఎట్టకేలకు పటాపంచలైంది.

అన్నాడీఎంకే నేతల సమావేశం అనంతరం ఆ పార్టీ డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుసామి మాట్లాడుతూ.. ఈరోజు నుంచి బీజేపీ, ఎన్డీయేలతో ఏఐఏడీఎంకే అన్ని సంబంధాలను తెంచుకుందని అధికారిక ప్రకటన చేశారు. ‘‘గత ఏడాది కాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం మా మాజీ నేతలు, మా ప్రధాన కార్యదర్శి ఈపీఎస్ (ఎడప్పాడి పళనిస్వామి), మా కార్యకర్తలపై అనవసర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఈరోజు జరిగిన సమావేశంలో ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాము’’ అని ఆ పార్టీ పేర్కొంది.

వార్తా సంస్థ పీటీఐ ప్రకారం, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యేక ఫ్రంట్‌కి నాయకత్వం వహిస్తామని అన్నాడీఎంకే తెలిపింది. నిజానికి ప్రస్తుతం దేశంలో రెండు ప్రధాన కూటములు ఉన్నాయి. ఇందులో ఒకటి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, మరొకటి కాంగ్రెస్, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీలతో సహా 28 పార్టీలతో ‘ఇండియా’ కూటమి. ఎన్డీయే, ఇండియా రెండింటిలోనూ భాగం కాని అనేక పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలతో మూడో కూటమి ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, బీజేపీతో పొత్తు తెంచుకున్న అనంతరం చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు టపాసులు పేల్చారు. ఇకపోతే పొత్తు తెగతెంపుల గురించి తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైని ప్రశ్నించగా.. తాను ఇప్పుడేం మాట్లాడనని అన్నారు. తాను పాదయాత్రలో ఉన్నందున.. పొత్తు గురించి ప్రకటన చేయలేనని అన్నామలై పేర్కొన్నారు.