తిరుపతి : కౌరవ సామ్రాజ్యం లాంటి చంద్రబాబు పాలనను మట్టి కరిపించే పాండవ సైన్యంలా వైసీపీ కార్యకర్తలు నాకు కనిపిస్తున్నారని పార్టీ అధినేత జగన్ అన్నారు. రేణిగుంట యోగానంద ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగిన వైసీపీ సమర శంఖారావం సభలో ఆయన సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. “నా కోసం ఎంతో చేశారు…మీకు తగిలిన గాయం నా గుండెకు కూడా తగిలింది..మీకు అండగా ఉండి, మీ బాగోగులు చూసుకుంటా…అన్ని విధాలుగా మిమ్మల్ని కాపాడుకుంటాను…మీరు రాజకీయ కార్యకర్తలు కాదు, నా కుటుంబ సభ్యులు….కులం, మతం, వర్గం, పార్టీలు చూడకుండా ప్రతి ఇంటికి సంక్షేమ పధకాలు అందిస్తాం ” అని సభకు వేలాదిగా తరలి వచ్చిన వైసీపీ కార్యకర్తలకు హామీ ఇచ్చారు.
చంద్రబాబు ఓ మారీచుడు, దొంగ సర్వేల పేరిట వైసీపీ అనుకూలుర ఓట్లను తొలగించాలని చూస్తున్నారని జగన్ ఆరోపించారు. రాబోయే ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి, మోసానికి, విశ్వసనీయతకు మధ్య జరగనున్నాయని అన్నారు. గత ఎన్నికలకు ముందు మొదటి సినిమా, గడిచిన నాలుగేళ్లలో రెండో సినిమా, తాజాగా మూడో సినిమా చంద్రబాబు ప్రారంభించారని ఆయన అన్నారు. మొదటి సినిమాలో అడుగడుగునా అబద్ధపు హామీలు ఇచ్చాడు. “ఆయన వస్తున్నాడు”. “బాబు రావాలి జాబు రావాలి”. అని నినాదాలతో గత ఎన్నికల ముందు ప్రజలను టీడీపీ మోసం చేసిందని తెలిపారు. కులాలను మోసం చేయడంలో చంద్రబాబు పిహెచ్ డి చేసాడని జగన్ ఆరోపించారు. రెండో సినిమాలో రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో చూపాడని, అన్నీ కాపీ పథకాలే రాష్ట్రంలో అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. “పోలవరం ప్రాజెక్ట్ పునాది దాటాక ముందే దానిని చంద్రబాబు జాతికి అంకితం చేస్తాడు. హోదా అంటే జైలుకే అన్న ఆయన ఇప్పుడు నల్ల చొక్కాలు వేసుకొని డ్రామా చేస్తున్నాడు. ఎన్నికలకు మూడు నెలల ముందు పసుపు కుంకుమ అంటూ కొత్త డ్రామా ప్రారంభించాడు.” అని జగన్ అన్నారు.
మొన్నటి రాష్ట్ర ఓట్ ఆన్ అక్కౌంట్ బడ్జెట్ తో ఆయనకు సంబంధం లేదని , దేవుని ఆశీసులతో మన ప్రభుత్వం దానిని అమలు చేస్తోందని ఆయన చెప్పారు. రాజధాని పేరిట బాహుబలి సినిమా సెట్టింగులు చూపిస్తున్నాడని ఎద్దేవా చేసారు జగన్. మేము ప్రకటించిన పింఛన్ల పెంపును తాను ప్రకటించి రెండో సినిమా చూపిస్తున్నాడని, నేను చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రతి కులానికి కార్పొరేషన్ అంటున్నాడని తెలిపారు. ఆరవ బడ్జెట్ పేరిట చంద్రబాబు మూడవ సినిమా ప్రవేశపెట్టారు…కాపీలు కొట్టడం కూడా చేతగాని వ్యక్తి చంద్రబాబు…ఎన్నికల్లో డబ్బులు తీసుకోండి… మనస్సాక్షితో ఓటేయండి అని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.