నేరగాళ్లతో నాగ్ భేటీ ఏంటీ : టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు

  • Publish Date - February 20, 2019 / 04:44 AM IST

ఏపీ రాజకీయాలు క్లయిమాక్స్ కు వచ్చాయి. ఎన్నికలు కూడా దగ్గరలో ఉండటంతో పార్టీల్లో వ్యూహాలు బిజీ అయ్యారు. వారం రోజులుగా ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని పరిణామాలను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు.. బరస్ట్ అయ్యారు. నిన్నటికి నిన్న జగన్ తో హీరో నాగార్జున భేటీ అయిన విషయాన్ని నేతల దగ్గర ప్రస్తావించారు బాబు. 2019 ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం టెలికాన్ఫరెన్స్ ద్వారా టీడీపీ నేతలతో రాజకీయాలపై మాట్లాడారు. ఈ సమయంలో జగన్ – నాగ్ భేటీ అంశం ప్రస్తావనకు వచ్చింది.

జగన్ ఓ నేరస్తుడు.. జైలుకి వెళ్లి వచ్చాడు.. అలాంటి వారితో సినీ నటులు ఎలా భేటీ అవుతారంటూ వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు. ఇది దురదృష్టకరమైన సంఘటనగా అభివర్ణించారు అధ్యక్షులు. ఇలాంటి భేటీలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని ఆవేదన వ్యక్తం చేశారు బాబు. అభివృద్ధికి అండగా నిలవాల్సిన సినీ ప్రముఖులు.. నేరగాళ్లతో జట్టు కట్టటం ఏంటీ.. వాళ్లతో సన్నిహితంగా ఉండటం ఏంటని నేతలకు ప్రశ్నలు సంధించారాయన. ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమకు ఎంతో చేస్తుంది.. ఇలాంటి టైంలో అండగా నిలవాల్సింది పోయి.. నేరగాళ్లతో మీటింగ్ లు ఏంటని నాగార్జున తీరును పరోక్షంగా ఎండగట్టారాయన.

 

ఇలాంటి పరిణామాలను ఏపీ ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారని.. నేరగాళ్లతో సినీ పరిశ్రమకు ఏం పని అనుకుంటున్నారంటూ ప్రజాభిప్రాయాన్ని కూడా వెల్లడించారాయన. నేరస్తులతో సినీ నటుడు భేటీ కావటం దురదృష్టకరం అంటూనే.. సినీ ఇండస్ట్రీ మొత్తం ఏపీ అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని కోరారు సీఎం చంద్రబాబు.