తిరుమల : వైసీపీకి 125 అసెంబ్లీ సీట్లు వస్తాయని, జగన్ సీఎం అవుతారని వైసీపీ నేత అవంతి శ్రీనివాస్ జోస్యం చెప్పారు. అవంతి ఆదివారం(ఏప్రిల్ 14,2019) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. ప్రభుత్వంలో మార్పు రాబోతోందని అన్నారు. జగన్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో ఈ ఎన్నికల్లో వైసీపీ 125 అసెంబ్లీ స్థానాల్లో ఘనవిజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు.
టీడీపీ పాలనకు ప్రజలు ముగింపు పలకబోతున్నారని అవంతి శ్రీనివాస్ చెప్పారు. జగన్ తోనే రాజన్న రాజ్యం సాధ్యమన్నారు. తాను భీమిలి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుస్తానని అవంతి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. జగన్ సీఎం అయితే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారని అవంతి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబులా కొన్ని వర్గాలకు కాకుండా అన్ని వర్గాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఏప్రిల్ 11న ఏపీలో పోలింగ్ జరిగింది. 80శాతం ఓట్లు పడ్డాయి. 2014 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. పెరిగిన ఓటింగ్ శాతం తమకే అనుకూలం అని టీడీపీ, వైసీపీ నాయకులు ఎవరికి వారు చెప్పుకుంటున్నారు.