అందరికీ అమ్మ ఒడి : జనవరి 9న ప్రారంభం

  • Publish Date - December 31, 2019 / 04:09 AM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘జగనన్న అమ్మఒడి’ పథకం ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్లు, కాలేజీలకే కాకుండా అన్‌ఎయిడెడ్‌ ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల విద్యార్థులందరికీ వర్తిస్తుందని పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని న్యూస్‌ చానళ్లు, సామాజిక మాధ్యమాల్లో ‘జగనన్న అమ్మఒడి’ పథకం ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులు/సంరక్షకులకు మాత్రమేనని వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. 

నవంబర్‌ 4న పాఠశాల విద్యాశాఖ విడుదలచేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు, ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 1వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదివే నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులు/సంరక్షకులకు జగనన్న అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని  వివరించారు.  

అమ్మఒడి పథకాన్ని జనవరి 9వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చిత్తూరులో ప్రారంభించనున్నారు. కలెక్టర్‌ భరత్‌నారాయణ్‌ గుప్త సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక మెసానికల్‌ మైదానంలో హెలిప్యాడ్‌ ఏర్పాటు, బహిరంగ సభ కోసం పీవీకేఎన్‌ మైదానాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎస్పీ సెంథిల్‌కుమార్, జాయింట్‌ కలెక్టర్‌ మార్కండేయులు ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. 

డెయిరీ, కలెక్టరేట్‌ సమీపంలోని స్థలాల్లో పార్కింగ్‌ ఏర్పాటు చేయాలని తెలిపారు.కార్యక్రమానికి సుమారు 30వేల నుంచి 40వేల మంది వరకు ప్రజలు హాజరయ్యే అవకాశముందని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని శాఖల అధికారులూ సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలన్నారు.