కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదని ఇప్పుడు బాగా ఫీలైపోతున్నారట. సర్పంచ్ నుంచి ఎంపీగా ఎదిగిన నాయకుడు కావడంతో గుర్తింపు కోరుకోవడం సహజమేనని జనాలు అంటున్నారు. అందులోనూ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎంపీ కాబట్టి ఆ మాత్రం గుర్తింపు కోరుకోవడంలో అర్థం ఉందని చెబుతున్నారు. అనుకోకుండా ఎంపీ అవ్వడమో.. లేక కార్పొరేటర్ స్థాయి నుంచి తమ కళ్ల ముందే ఎదిగారన్న చిన్న చూపో ఏమో గానీ.. మొత్తం మీద జిల్లాలో ఆయనను అధికారులు సరిగా పట్టించుకోవడం లేదంట.
పరిచయ కార్యక్రమాలతో బిజీ :
ప్రజలు గుర్తించిన ఎంపీ సంజయ్‌కు ఇప్పుడు అదే కొత్త సమస్యగా మారిందంట. ఈ సమస్యతో బాగా ఫీలైన ఆయన.. ఇందుకు విరుగుడుగా పరిచయ కార్యక్రమాలు మొదలు పెట్టారు. హిందూత్వవాదిగా కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో బండి సంజయ్ తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీ వరకు అంచలంచెలుగా ఎదిగిన సంజయ్‌ని జిల్లా అధికారులు గుర్తించడం లేదంట.
పోలీసు శాఖ, పరిపాలన విభాగాల అధికారులు.. ఇలా అందరూ రాష్ట్రంలోని అధికార పార్టీ నేతలకే ప్రాధాన్యం ఇస్తున్నారట. ఎంపీ అయినా సంజయ్‌కి ఆ స్థాయిలో ప్రాధాన్యం కల్పించడం లేదట. అధికారుల నుంచి ఎదురవుతున్న తిరస్కారాన్ని మనసులో పెట్టుకొని అవకాశం దొరికినప్పుడు వారికి చురకలు అంటిస్తున్నారట.
ఉమ్మడి జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలే రాజకీయాలను శాసిస్తున్నారు. అధికారులు కూడా వారు చెప్పినట్టే నడుచుకుంటున్నారట. ఇలాంటి పరిస్థితిలో ఎంపీ హోదాలో సంజయ్ చెప్పిన మాటలలను అసలు అధికారులు పట్టించుకోకపోవడం, చెప్పిన పనులు పెండింగ్‌లో పెడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై గుర్రుగా ఉన్నారట. ప్రొటోకాల్ పాటించడం లేదని ఇప్పటికే అధికారులతో పలుమార్లు పంచాయతీ పెట్టుకున్నప్పటికీ వారిలో పెద్దగా మార్పు కనిపించలేదు. దీంతో కేంద్ర పథకాల సమీక్షల సందర్భంగా అధికారులను ఓ ఆట ఆడుకుంటున్నారట.
అధికారులకు నేనంటే తెలియదు :
ఇటీవల జరిగిన దిశ మీటింగ్‌లో నా పేరు సంజయ్… కరీంనగర్ ఎంపీని అంటూ పరిచయం చేసుకున్నారు. అధికారులకు నేనంటే తెలియదు… ఎంపీగా గుర్తించడం లేదంటూ తన మనసులో దాగి ఉన్న కోపాన్ని శాంతంగా సెలవిచ్చారు. సంజయ్‌ని ఎంపీగా అధికారులు గుర్తించకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయంటారు ఓ వర్గం నేతలు.
జిల్లాలో గెలిచిన ఏకైక బీజేపీ ఎంపీ కావడం, గ్రామ సర్పంచ్ నుంచి మంత్రి వరకు టీఆర్ఎస్‌కు చెందిన వారే ఉండడంతో ఎంపీకి ప్రాధాన్యం లేకుండా పోతుందని అంటున్నారు. నిరసనల సమయంలో పోలీసులతో వాగ్వాదానికి దిగడం, వారినే టార్గెట్ చేస్తూ విమర్శిస్తుండడంతో అధికారులు ఈ ఖద్దరు నేతను ఖాతరు చేయడం లేదంటున్నారు.
ఇక అడ్మినిస్టేషన్ విభాగానికి సంబంధించిన అధికారులు తన మాట వినడం లేదనే కారణంతో వారిపై అజమాయిషీకి పోయి, దూరం చేసుకుంటున్నారట. దీంతో సమీక్ష సమావేశాల్లో వారికి కౌన్సిలింగ్ ఇస్తూ తన పొజిషన్ ఏంటో గుర్తు చేస్తున్నారట. ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఏం లాభం… అధికారులతో అంతరం ఉంటే అని జనాలు అనుకుంటున్నారు. మరి భవిష్యత్తులో అయినా అధికారులు ఆయనను గుర్తిస్తారా.. లేక ఇలాంటి పరిచయ కార్యక్రమాలు ఐదేళ్ల పాటు చేసుకుంటూ వెళ్తారా అన్నది చూడాలి.