Kishan Reddy: అధికార భారత్ రాష్ట్ర సమితి సహా కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేస్తూ తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య అవగాహన ఉందన్న విమర్శలపై ఆయన స్పందిస్తూ పొత్తులు, ఒప్పందాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మాత్రమే చేసుకుంటాయని అన్నారు. రాష్ట్రంలో దేశంలో అధికారం పంచుకున్న చరిత్ర ఆ పార్టీలదేనని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 8న వరంగల్ సభకు రానున్న సందర్భంగా గురువారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లే. ఆ రెండు పార్టీల టీఎన్ఏ ఒక్కటే. కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన వారికి కేసీఆర్ మంత్రి పదవులు ఇచ్చారు. బీఆర్ఎస్ను పాతరేసి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం. కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ పోరాటం కొనసాగుతుంది. లక్ష్మణ్, బండి సంజయ్ నాయకత్వంలో మంచి ఫలితాలను సాంధించాం. ప్రజాస్వామ్య పద్దతిలో బీఆర్ఎస్ను పాతరేయటానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుకూలంగా బీజేపీ పరిపాలన ఉంటుంది’’ అని అన్నారు.
ఇక బీఆర్ఎస్ మీద ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘దళిత ముఖ్యమంత్రి, డబుల్ బెడ్రూం ఇళ్ళు సహా నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారు. నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేయటంలో కేసీఆర్ విఫలమయ్యారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు స్థలం ఉంటోంది కానీ.. పేదలకు ఇవ్వటానికి స్థలం లేదా? పాతబస్తీ ఫలక్ నామా వరకు మెట్రోను ఎందుకు పొడిగించలేదో కేసీఆర్ చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవటం వలనే అనేక రైల్వే ప్రాజక్టులు ఆగిపోయాయి. ఎస్సీ విద్యార్ధులకు కేంద్రం స్కాలర్‌షిప్ లు ఇస్తామంటే కేసీఆర్ సర్కార్ అడ్డుకుంది. దశాబ్ది ఉత్సవాలు కేసీఆర్ కుటుంబానికి మాత్రమే’’ అని కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. అనంతరం వరంగల్లో జరగున్న ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.