మీటింగ్ టైం : డిసెంబర్ 11న టి.కేబినెట్ 

  • Publish Date - December 8, 2019 / 12:58 AM IST

తెలంగాణ కేబినెట్ డిసెంబర్ 11న సమావేశం కానుంది. సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగితే మంత్రివర్గ సమావేశంలో అనేక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా ఇరిగేషన్‌ శాఖకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై కేసీఆర్ సమీక్షించే అవకాశం ఉంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పూర్తి స్థాయిలో అందడంలేదని కేసీఆర్ వెల్లడిస్తున్నారు. దీనిపై కేంద్రానికి లేఖ రాశారు కూడ. కేబినెట్ సమావేశంలో ఈ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు పరిస్థితిపై  మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఇటీవల సీఎం నిర్వహించిన సమీక్షలో ఇరిగేషన్‌కు సంబంధించి కొత్తపనులు చేపట్టాలని నిర్ణయించారు.
దుమ్ముగూడెం వద్ద 37 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పాటు 320 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా ఆనకట్ట నిర్మించాలని సీఎం నిర్ణయించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోస్తున్న నేపథ్యంలో.. మొత్తం మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా అదనపు పనులు చేపట్టాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.

వీటికి సంబంధించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. వీటితో పాటు సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను కూడా చేపట్టనున్నారు. మొత్తం పనులకు 14వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా. దీనిపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశముంది. కొత్త రెవెన్యూ చట్టంపై కూడా మంత్రివర్గం చర్చించే అవకాశముంది. 
రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అవినీతికి ఆస్కారం లేని పారదర్శకమైన రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తామని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు.

రెవెన్యూ చట్టం సిద్ధమై మంత్రివర్గం ఆమోదం పొందితే ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి.
ఆర్టీసీకి సంబంధించి కార్మికుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొన్ని హామీలు ఇచ్చారు.. వాటిపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.  
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వయో పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది.
Read More : సౌకర్యాలు లేవు : దిశా నిందితుల డెడ్ బాడీస్ తరలింపు