వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన భారత పౌరసత్వం రద్దు చేస్తూ.. కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నమనేని భారత పౌరసత్వానికి అనర్హుడని ప్రకటించింది. రమేష్ మోసపూరితంగా భారత పౌరసత్వం పొందారన్న హోంశాఖ.. జర్మనీ పౌరసత్వం ఉందన్న విషయాన్ని దాచారని ఆరోపించింది. తాజా పరిణామంతో చెన్నమనేని తన ఎమ్మెల్యే పదవి కోల్పోయే అవకాశం ఉంది. చెన్నమనేని రమేష్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ 2009 లోనే ఆది శ్రీనివాస్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. 2010లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు 2013లో ఎమ్మెల్యే రమేష్ బాబుకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పుపై సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు రమేష్ బాబు. అలాగే పౌరసత్వ వివాదం కేంద్ర హోంశాఖే తేల్చాల్సి ఉంటుందని సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశారు. దీంతో కేంద్ర హోంశాఖ రమేష్ బాబు పౌరసత్వంపై విచారణ చేపట్టింది. ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది.
హోంశాఖ నియమించిన త్రిసభ్య కమిటీ.. గతంలో రమేష్ బాబు జర్మనీ వెళ్లడం అక్కడ సాగించిన కార్యకలాపాలపై సమగ్రంగా విచారణ చేపట్టింది. నిబంధనలు పాటించకుండానే రమేష్‌బాబు భారత పౌరసత్వం పొందారని కమిటీ నివేదిక ఇచ్చింది. దీంతో హోంశాఖ చెన్నమనేని పౌరసత్వన్ని రద్దు చేసింది. అయితే దీనిపై మళ్లీ రివ్యు పిటిషన్ దాఖలు చేశారు రమేష్ బాబు. రివ్యూ తరువాత 2017 డిసెంబర్ మరోసారి కేంద్ర హోంశాఖ భారత పౌరసత్వంపై రమేష్ బాబుకి వ్యతిరేకంగా ఆదేశాలను జారీ చేసింది. అయితే.. దీన్ని 2019 జూలై 23న హైకోర్టు రద్దు చేసింది.. త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను పునఃపరిశీలించి 12 వారాల్లో తేల్చాలని హోంశాఖని ఆదేశించింది. దీనిపై రమేశ్‌బాబు వాదనలను విన్న హోంశాఖ… ఆయనకు వ్యతిరేకంగా మరోసారి ఆదేశాలు జారీ చేసింది.
ఎప్పటికైనా ధర్మం, న్యాయమే గెలుస్తుందన్న తన నమ్మకానికి కేంద్ర హోంశాఖ నిర్ణయమే నిదర్శనమని చెప్పారు ఆది శ్రీనివాస్. 2009 నుంచి తాను న్యాయపోరాటం చేస్తున్నానని.. ఇప్పటికే అనేకసార్లు హైకోర్ట్ మొట్టికాయలు వేసినా చెన్నమనేనిలో మార్పు రాలేదని విమర్శించారు. మరోవైపు తన పౌరసత్వ పరిరక్షణకు మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తానన్నారు చెన్నమనేని రమేష్. ఈ ఏడాది జులైలో హైకోర్ట్ ఇచ్చిన తీర్పులోని అంశాలను హోంశాఖ పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. సెక్షన్ 10 (3)ని పరిగణించకుండా ఏ నిర్ణయం వెలువడినా.. తమను ఆశ్రయించవచ్చని హైకోర్ట్ తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. హైకోర్ట్ తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందనే నమ్మకముందని చెప్పారు చెన్నమనేని.