లోక్‌సభ ఎన్నికలు.. ఏ రాష్ట్రంలో ఎవరికి ఎన్ని సీట్లు..

ఇండియా టుడే ఆజ్ తక్ సర్వేలో ఉత్తరప్రదేశ్ కు సంబంధించి మొత్తం 80 లోక్ సభ స్థానాలకు గాను 70 చోట్ల బీజేపీ విజయదుంధుబి మోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Mood Of Nation Lok Sabha Polls

Lok Sabha Elections : వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ ఎన్డీయే కూటమి విజయ ఢంకా మోగించనుందని ఇండియా టుడే – ఆజ్‌తక్‌ సర్వేలో వెల్లడైంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రాల వారీగా ఏ పార్టీకి విజయావకాశాలు ఎలా ఉన్నాయన్న దానిపై మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ పేరిట డిసెంబర్‌ 15 నుంచి జనవరి 28 మధ్య మొత్తం 35 వేల 801 మంది ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ఈ సర్వే ఫలితాల ప్రకారం బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి విజయ దుందుభి మోగించనుంది.

మరో రెండు నెలల్లో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించి ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టనునున్నట్లు తేలింది. ఉత్తరప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకునే పరిస్థితి ఉండగా.. తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలో ఇండియా కూటమికి మెజార్టీ సీట్లు లభించే అవకాశాలున్నాయి. పశ్చిమబెంగాల్‌లో తృణముల్‌ కాంగ్రెస్‌ హవా కొనసాగనుంది. ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే – ఆజ్‌తక్‌ గ్రూప్‌.. సీ ఓటర్‌ సంస్థతో కలిసి చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే.. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన కూటమికి 17, అధికార వైసీపీకి 8 లోక్‌సభ సీట్లు దక్కుతాయని సర్వేలో వెల్లడైంది. ఇక తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ 10 సీట్లు గెలుచుకుంటే.. బీఆర్‌ఎస్‌, బీజేపీ చెరో మూడు స్థానాల్లో, ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధించే అవకాశమున్నట్లు తేలింది.

కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలుండగా.. అందులో బీజేపీకి కూటమికి 24, కాంగ్రెస్‌కు 4 సీట్లు మాత్రమే దక్కనున్నట్లు వెల్లడైంది. తమిళనాడులోని మొత్తం 39 స్థానాల్లో డీఎంకే ఆధ్వర్యంలోని ఇండియా కూటమి గెల్చుకోనునున్నట్లు తేలింది. కేరళలోనూ మొత్తం 20 లోక్‌సభ స్థానాలను సీపీఎం ఆధ్వర్యంలోని ఇండియా అలయెన్స్‌ దక్కించుకోనుంది.

Also Read : ఏపీలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్..! ఇప్పటికిప్పుడు ఎంపీ ఎన్నికలు జరిగితే వచ్చే ఫలితాలు ఇవే..!

పశ్చిమ బెంగాల్‌లో తృణముల్‌ కాంగ్రెస్‌ కూటమికి 22, ఎన్డీయే కూటమికి 19 సీట్లు దక్కనున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ సీట్లుండగా.. 70 స్థానాల్లో బీజేపీ విజయ దుందుభి మోగించే అవకాశముందని సర్వేలో తేలింది. ఇక బీహార్‌లో నితీశ్‌కుమార్‌-బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి 32 సీట్లు, ఇండియా కూటమి 8 స్థానాలు దక్కించుకోనున్నాయి.

మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలుండగా.. అందులో 26 సీట్లు ఇండియా కూటమికి, మిగతా 22 ఎన్డీయే అలయెన్స్‌కు దక్కనున్నాయి. ఇందులో ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌ 12 చోట్ల, 14 చోట్ల శరద్‌పవార్‌-ఉద్దవ్‌ ఠాక్రే కూటమి విజయం సాధిస్తాయని తేలింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న మొత్తం 7 స్థానాలనూ ఎన్డీయే కూటమే దక్కించుకోనుంది.

హర్యానాలో మొత్తం 10 స్థానాలకు గాను.. బీజేపీకి 8 సీట్లు గెలుచుకోనుండగా.. పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ 5, కాంగ్రెస్‌ మరో 5 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వేలో తేలింది. అసోం, ఝార్ఖండ్‌లో 14 చొప్పున ఎంపీ స్థానాలుండగా.. రెండు రాష్ట్రాల్లో బీజేపీ 12 చొప్పున స్థానాలు గెలుచుకోనుంది. అసోంలో ఇండియా కూటమికి రెండు సీట్లు మాత్రమే దక్కే ఛాన్స్‌ ఉంది. ఇక ఉత్తరాఖండ్‌లోని ఐదు స్థానాల్లో ఎన్డీయే గెలిచే ఛాన్స్‌ ఉండగా.. హిమాచల్‌ప్రదేశ్‌లోని మొత్తం 4 సీట్లనూ బీజేపీయే కైవసం చేసుకుంటుందని సర్వేలో తేలింది.

ఈసారి ఎలాగైనా బీజేపీని ఓడించి అధికారం చేపట్టాలని ఇండియా కూటమి ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీకి.. తాజా సర్వే పెద్ద షాకే ఇచ్చిందని చెప్పొచ్చు. మొత్తంగా ప్రస్తుత పరిస్థితుల్లో మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ మొత్తం బీజేపీ వైపే ఉందని తేలిపోయింది.

Also Read : టీడీపీతో పొత్తు కుదిరితే.. బీజేపీ ఆశిస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ఇవే? అభ్యర్థులు కూడా ఖరారు?

 

 

 

ట్రెండింగ్ వార్తలు