వైసీపీ అధినేత జగన్‌పై జాతీయ నేతలు గురి పెడుతున్నారా? ఎన్నికల ఫలితాల తర్వాత తమవైపు తిప్పుకోవాలని భావిస్తున్నారా? ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలు ఇందుకు అద్దం పడుతున్నాయా? అదే నిజమైతే బీజేపీ, కాంగ్రెస్‌లో వైసీపీ మద్దతిచ్చేది ఎవరికి? అసలు జాతీయ పార్టీలు జగన్‌వైపే చూడటానికి కారణమేంటి? ఏపీలో ఎన్నికల ఫలితాలు రాకముందే..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీల దృష్టిని ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ సహా ఇతర జాతీయ పార్టీలు..జగన్‌ను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఈసారి కేంద్రంలో ఏ కూటమికీ స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదన్న ప్రచారం నేపథ్యంలో జాతీయ పార్టీలు ముందస్తు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ నుంచి జగన్‌ను కూడా కలుపుకొని పోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఈసారి కేంద్రంలో NDAకానీ.. UPA కానీ.. పూర్తిస్థాయి మెజారిటీ సాధించే అవకాశం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే.. ఫలితాల తర్వాత ప్రాంతీయ పార్టీలదే కీలకపాత్ర. ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ పేరుతో బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకతాటి పైకి తెచ్చే పనిలో ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎవరి ప్రయత్నాల్లో వారుండగా… జాతీయ పార్టీలు వైసీపీపై ఫోకస్ పెట్టాయి. జగన్‌ను తమవైపు తిప్పుకునేందుకు జాతీయస్థాయిలో కీలకంగా ఉన్న కొందరు నేతలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. వివిధ సర్వేల నివేదికల ప్రకారం ఏపీలో వైసీసీ ఎక్కువ ఎంపీ సీట్లు సాధించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అందుకే.. ఫలితాల కంటే ముందే జాతీయ నేతలు జగన్‌తో దోస్తీకి చేయి చాపుతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇటీవలే కేరళకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు వైసీపీ లీడర్లతో చర్చలు జరిపినట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ జగన్‌తో చర్చల కోసం మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని రంగంలోకి దింపిందని చర్చ జరుగుతోంది. అవసరమైతే సోనియాగాంధీ కూడా ఫలితాల తరువాత జగన్‌తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఇదిలాఉంటే.. చాలా రోజులుగా జగన్‌తో బీజేపీ నేతలు టచ్‌లోనే ఉన్నారు. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి… ఇప్పటికే పలుసార్లు కమలనాథులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.
మరోవైపు వైఎస్ జగన్ మాత్రం… జాతీయస్థాయిలో ఏ పార్టీకి మద్దతివ్వాలన్న విషయంపై… మొదట్నుంచీ క్లారిటీతో ఉన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చిన పార్టీకే తాము అండగా నిలుస్తామని ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చారు. మొత్తానికి కౌంటింగ్‌కు రోజులు దగ్గర పడుతున్న సందర్భంలో… జాతీయ నేతలు జగన్‌తో దోస్తీ కోరుకోవడం వైసీపీలో జోష్ నింపుతోంది.