ఏపీలో అక్టోబరు 2 నుంచి కొత్త పాలనా వ్యవస్ధ

  • Publish Date - September 30, 2019 / 04:25 AM IST

ఏపీలో అక్టోబరు 2 గాంధీ జయంతి రోజు నుంచి కొత్త ప్రజా పరిపాలనా వ్యవస్ధ అమల్లోకి  వస్తోంది.  గాంధీజీ కలలుకన్న స్వరాజ్య స్ధాపన స్ఫూర్తితో సీఎం జగన్  రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధను అందుబాటులోకి తీసుకవస్తున్నారు.  ప్రజల చెంతకే పాలనా వ్యవస్ధను రూపోందించి ప్రభుత్వ సంక్షేమ పధకాలు ప్రతి ఒక్కరికి చేరేలా ఈ వ్యవస్ధను రూపోందించారు.  ఇందుకోసం 1లక్షా 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వీరికి మొదటి రెండేళ్లు నెలకు 15 వేల రూపాయలు వేతనం ఇచ్చి రెండేళ్ల తర్వాత  స్కేలు అమలు చేయనున్నారు.
దేశ చరిత్రలో ఇంత మందికి ఒక్కసారి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ సాధారణ సేవలను అందుబాటు లోకి తీసుకు రావటం ఇదే ప్రధమం. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబరు 30న విజయవాడలోని ఎ-ప్లస్‌ కన్వెన్షన్‌ హాలులో జరిగే కార్యక్రమంలో ఉదయం 10.30 గంటలకు సీఎం జగన్‌ నియామక పత్రాలు  అందచేయనున్నారు. . కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన దాదాపు 5 వేల మంది అభ్యర్థులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. మొదటి రోజున ఒక్కో జిల్లాల్లో 3 నుంచి 5 వేల మంది అభ్యర్థులకు నియామకపత్రాలు ఇవ్వనున్నారు.

ఇక జిల్లాల్లో సంబంధిత మంత్రులు అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. అయితే ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నెలరోజుల్లోగా విధుల్లో చేరాల్సి ఉంటుంది. లేదంటే వారి నియామకాన్ని రద్దు చేస్తారు. ఎంపిక జాబితా నుంచి వారి పేరును తొలగించనున్నారు.ప్రభుత్వం కోరిన సర్టిఫికెట్లను (పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలనే మెసేజ్ కూడా వెళ్తుంది. దీంతోపాటు అభ్యర్థి పొందుపరిచిన ఈమెయిల్‌కు కూడా సమాచారం పంపుతారు. బీసీలు క్రీమీలేయర్ సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి.