సై : వారణాసిలో ప్రధాని మోడీపై నిజామాబాద్ రైతులు పోటీ

  • Publish Date - April 24, 2019 / 08:40 AM IST

తెలంగాణ రైతులు ప్రధాని మోడీపై పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. వారణాసిలో ప్రధానిపై నిజామాబాద్ రైతులు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు పోరుబాట పట్టారు. ప్రధానిపై వారణాసిలో పోటీ చేయాలని నిర్ణయించుకున్న రైతులు ఏప్రిల్ 27న నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ప్రధాని మోడీపై 50మంది రైతులు పోటీకి సిద్ధమవుతున్నారు. ప్రత్యేక బోగీలో నిజామాబాద్ రైతులు గురువారం (ఏప్రిల్ 25,2019) వారణాసికి వెళ్తున్నారు. ఇందూరు రైతులు వారణాసి రైతు సంఘాల మద్దతు తీసుకున్నారు. ప్రధానిపై పోటీ చెయ్యాలని నిర్ణయించుకున్న నిజామాబాద్ రైతులకు తమిళనాడు రైతుల కూడా నుంచి సపోర్ట్ లభించింది.

నిజామాబాద్‌లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవితపై పోటీ చేసి దేశం దృష్టిని తమవైపు తిప్పుకున్న పసుపు, ఎర్రజొన్న రైతులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఏకంగా ప్రధాని మోడీపై పోటీకి దిగుతున్నారు. ప్రధాని మోడీ రెండవసారి పోటీ చేస్తున్న వారణాసి నుంచి పెద్ద సంఖ్యలో బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు. పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు దైవశిగామణి నేతృత్వంలో 50మంది రైతులు ‘ఛలో వారణాసి’ కార్యక్రమం చేపట్టారు.

నిజామాబాద్‌ జిల్లాలోని అర్మూర్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల నుంచి వారణాసి వెళ్లి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయనున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర కల్పించనందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైతులు చెబుతున్నారు. తెలంగాణలోని నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 176 మంది అభ్యర్థులు పోటీచేయడంతో దేశంలోనే తొలిసారి ఎం3 రకం ఈవీఎంలను వినియోగించి పోలింగ్ జరపాల్సి వచ్చింది. పసుపు బోర్డు సాధనే లక్ష్యంగా పసుపు రైతులు వారణాసి నుంచి కూడా పోటీకి రెడీ అయ్యారు.