చంద్రబాబు ఇప్పటికైనా మేల్కోకపోతే, ఆ జిల్లాలో టీడీపీ పతనం ఖాయం

  • Publish Date - September 8, 2020 / 10:23 AM IST

సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం కలిగిన తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్లు ఉన్న ఆ పార్టీకి ముందుండి నడిపించే నాయకుడు జిల్లాలో లేకపోవడమే దీనికి కారణమని ఆ నోటా ఈ నోటా వినిపిస్తున్న మాట. చెప్పుకోవడానికి చాంతాడంత నాయకుల లిస్టున్నా అటు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయడానికి, ఇటు పార్టీని బలోపేతం చేయడానికి ఒక్కరూ ముందుకు రాని పరిస్థితి ఉందని పార్టీ వర్గాల్లో టాక్.

ఓటమి భారంతో ఇంకా ఇంట్లో కూర్చుంటే ఎలా?
పార్టీ జిల్లా అధ్యక్షుడు నామాన రాంబాబు అసలు పార్టీలో ఉన్నారా? అని కొంతమంది అనుమానాలున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు యనమల, చినరాజప్ప ఆధిపత్యంతో సైలంట్‌గా ఉండే నామాన ఇప్పుడైనా నోరు విప్పాలని ద్వితీయ శ్రేణి నాయకులు అడుగుతున్నారు. ఎన్నికలు ఫలితాలు వచ్చి దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా ఓటమి భారంతో ఇంకా ఇంట్లో కూర్చుంటే పార్టీ ఎలా బలోపేతం అవుతుందని కేడర్‌ మదనపడిపోతున్నారు. ప్రభుత్వ వైఫల్యాల మాట దేవుడెరుగు కనీసం పార్టీ కార్యక్రమాలను అయినా చురుగ్గా నిర్వహిస్తే కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుందని డిస్కస్‌ చేసుకుంటున్నారు.

కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పట్టించుకోకపోతే ఎలా?
జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుక, మద్యం, గ్రావెల్ మాఫియాను ఎలాగూ ప్రశ్నించ లేరు కనీసం ఇళ్ళ పట్టాల పంపిణీ కోసం సేకరిస్తోన్న భూముల్లో జరుగుతున్న అవినీతి, కరోనా నియంత్రణలో జిల్లా యంత్రాంగం వైఫల్యలను కూడా ప్రశ్నించక పోతే ఎలా కార్యకర్తలు విపరీతంగా ఫీలైపోతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ ప్రజలు, కార్యకర్తల సమస్యలు పట్టించుకోలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పట్టించుకోకపోతే ఎలా అని చెవులు కొరుక్కుంటున్నారు.

టీడీపీ నేతల తీరుపై అభిమానులు ఆగ్రహం:
కరోనా పాజిటివ్ కేసుల విషయంలో తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో కొనసాగడానికి అధికార పార్టీ నాయకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం అని జిల్లా ప్రజలు అంటున్నా.. టీడీపీ నాయకులు మాత్రం కనీసం నోరిప్పకపోవడంతో పార్టీ అభిమానులు గుర్రుమంటున్నారు. కరోనా సమయంలో ప్రతిపక్ష పార్టీలపై విపరీతమైన ఆంక్షలు పెడుతున్న జిల్లా అధికారులు.. అధికార పార్టీ నేతల శుభకార్యాల నుంచి ప్రారంభోత్సవాలు, విజయోత్సవ ర్యాలీల వరకు ఎలాంటి అడ్డంకులు కలిగించడం లేదు.

ఎవరి దారి వారిదే:
జిల్లాలో కరోనా విజృంభణకు రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవం ఒక కారణమైనా దానిపై ఏ టీడీపీ నాయకుడూ మాట్లడకపోవడంపై కార్యకర్తలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రాజానగరం నియోజకవర్గంలో ఆవ భూముల కుంభకోణం వైసీపీలోని అసంతృప్త నాయకుల వల్ల బయటకు వచ్చిందే తప్ప టీడీపీ నేతల వల్ల కాదని అంటున్నారు. ఆ కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత కూడా పోరాటానికి టీడీపీ నాయకులంతా ఏకతాటిపైకి రాలేదనే వాదన బలంగా వినిపిస్తోంది.
https://10tv.in/three-time-ex-mla-nirvendra-kumar-mishra-dies-after-assault-over-land-dispute-in-uttar-pradesh/
రూరల్ ఎమ్మెల్యే వర్సెస్ సిటీ ఎమ్మెల్యే:
రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీల మధ్య పొసగడం లేదని చెబుతున్నారు. ఇరు వర్గాల మధ్యలో పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారని అక్కడ వినిపిస్తున్న టాక్. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హడావుడి చేసే నాయకులు.. అధికారం కోల్పోయాక పార్టీకి దూరంగా ఉండటంతో కార్యకర్తలు చాలా ఆగ్రహంతో ఉన్నారు.

పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనడం లేదని ఆవేదన:
ముఖ్యంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, అమలాపురం మాజీ ఎమ్మెల్యే ఆనందరావు, రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్‌, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్య పిల్లి అనంతలక్ష్మి, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, తుని, పి.గన్నవరం, కొత్తపేట, ప్రత్తిపాడు టీడీపీ నాయకులు పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనకపోవడంతో కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం సన్నగిల్లుతోందని టాక్.

మీడియా సమావేశాల్లోనే ప్రతాపం:
యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ కేవలం మీడియా సమావేశాల్లోనే ప్రతాపం చూపిస్తునర్నారని అంటున్నారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కూడా పార్టీ కార్యక్రమాలకు తప్ప ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడటం లేదు. 14 ఏళ్ల తర్వాత వచ్చిన వరదలకు జిల్లా అతలాకుతలమైంది. సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైనా టీడీపీ నాయకులు మౌనం వహించడాన్ని కేడర్‌ జీర్ణించుకోలేకపోతోంది.

సార్వత్రిక ఎన్నికల్లో పట్టిన గతే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుంది:
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం 144 సెక్షన్ పెట్టినా టీడీపీ నాయకులు నోరు మెదపకపోవడం వెనుక నాయకుల అంతర్గత విభేదాలే కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా తర్వాత జిల్లాలో అనేక విషయాల్లో ప్రభుత్వం విఫలమై ప్రజల ఆగ్రహానికి గురైనా ప్రతిపక్ష పార్టీగా టీడీపీ దానిని క్యాష్ చేసుకోలేకపోవడంతో కేడర్‌ బాగా ఫీలవుతోంది. అధిష్టానం ఇప్పటికైనా స్పందించి జిల్లాలో నాయకత్వ లోపాన్ని సరిదిద్దకపోతే సార్వత్రిక ఎన్నికల్లో పట్టిన గతే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎదుర్కోవలసి వస్తుందని అంటున్నారు.