2024 Elections: వచ్చే లోక్సభ ఎన్నికలపై ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దేశంలోని సుమారు 28 విపక్ష పార్టీలు కలిసి ఇండియా అనే పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కూటమి కట్టినట్లు అన్ని పార్టీలు భారీ ప్రకటనలే చేశాయి. అయితే వాస్తవంలో అది జరుగుతుందా, ఇంతకీ వచ్చే ఎన్నికలపై ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనే ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి. ఈ విషయంపైనే సీ-ఓటర్ సర్వే నిర్వహించింది.
Vladimir Putin: జీ-20 సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ రావడం లేదట
వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరోసారి ఘన విజయం సాధించేలాగే కనిపిస్తోంది. ఈసారి కూడా 300 పై చిలుకు స్థానాలతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రజల అభిప్రాయాల ద్వారా తెలిసిందని సర్వేలో పేర్కొన్నారు. 28 పార్టీలు జత కట్టినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేదని, ఆ కూటమికి 200 స్థానాలు కూడా రావని సర్వే చెబుతోంది. ఎన్డీయేను ఇండియా ఓడిస్తుందా అని ప్రశ్నించగా.. కేవలం 33 శాతం మంది మాత్రమే అనుకూలంగా ఓటు వేశారు. ఎన్డీయేను ఇండియా ఓడించలేదని 54 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే.. గత రెండేళ్లతో పోలిస్తే రాహుల్ గాంధీ గ్రాఫ్ బాగానే పెరిగిందట. ఇంతకు ముందు విపక్షాల నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయనకు ఉన్న మద్దతుతో పోలిస్తే ఇప్పుడు బాగా పెరిగింది. ఇదంతా భారత్ జోడో యాత్ర ఫలితమని అంటున్నారు. అయితే ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీని ఢీకొట్టే స్థాయిలో మాత్రం రాహుల్ లేరని ప్రజలు అభిప్రాయపడ్డారు. విపక్షాల కూటమికి ఇండియా అనే పేరు పెట్టడం ఓట్ల పరంగా పెద్దగా కలిసి వచ్చేలా కనిపించడం లేదు. కేవలం 39 శాతం మాత్రమే ఇందుకు అనుకూలంగా ఓటేశారు. అలాంటిదేమీ జరగదని 30 శాతం చెప్పగా.. ఏదీ చెప్పలేమని 18 శాతం పేర్కొన్నారు.