pawan kalyan on panchayat election results: ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుదారుల గెలుపుతో మార్పు మొదలైందని పవన్ అన్నారు. గ్రామాల్లో జనసేన బలంగా ఉందని ఈ ఫలితాలు చెబుతున్నాయన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లు, బెదిరింపులను జనసైనికులు తట్టుకుని నిలిచారని పవన్ అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న అధికార పార్టీ భయపడుతోందని కామెంట్ చేశారు. తొలి రెండు దశల్లో చూపిన స్ఫూర్తిని మలిదశలోనూ చూపించాలని జనసైనికులకు పిలుపునిచ్చారు పవన్. మున్సిపల్ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్ఈసీని కోరారు పవన్.
రాష్ట్రంలో అధికార పార్టీ ప్రోద్బలంతో ఏకగ్రీవాలు జరుగుతున్నాయని.. పల్లెల్లోని ప్రజలను బెదిరించి ఏకగ్రీవాలు చేయడం సరికాదన్నారు. గ్రామాల్లో రెండు వర్గాల మధ్య పోటీ జరిగినప్పుడే అభివృద్ధి సాధ్యమని పవన్ అభిప్రాయపడ్డారు. మార్పు కోసం జనసేన బలంగా పోరాటం చేస్తుందని.. జనసైనికులే అధికార పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు.
జనసేన ఖాతాలో 1500 వార్డులు:
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో జనసేన ప్రభావం స్పష్టంగా కనిపించిందని పవన్ అన్నారు. తొలి విడతలో జనసేనకు 18శాతం ఓట్లు వస్తే.. రెండో విడతలో 22శాతం ఓట్లు వచ్చాయన్నారు. 250కి పైగా పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు జనసేన మద్దతుదారులు గెలుచుకున్నారని… 1500 పంచాయతీల్లో రెండోస్థానం వచ్చిందన్నారు. 1500 వార్డులు తమ పార్టీ ఖాతాలో చేరినట్లు పవన్ వెల్లడించారు.
మార్పును జనసేన తీసుకొస్తుంది:
జనసేన మద్దతుతో గెలిచిన సర్పంచ్ లు తమ కిందే పనిచేస్తారంటూ వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. అలాగే పంచాయతీల్లో జనసేన మద్దతుతో పోటీ చేసే అభ్యర్థులను బెదిరిస్తున్నారని.. ప్రలోభాలకు గురిచేసి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేయడం దుర్మార్గమన్నారు. అధికార పార్టీ మాట వినని వారిని కిడ్నాప్ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో వైసీపీకి ఓట్లు వేయించాల్సిందిగా ఎమ్మెల్యేలు గ్రామ వాలంటీర్లపై ఒత్తిడి తెస్తున్నారని పవన్ ఆరోపించారు. అధికార పార్టీ నేతల బెదిరింపులకు భయపడాల్సిన అసరం లేదని.. ధైర్యంగా నిలబడి రాష్ట్రానికి కావాలిసిన మార్పును జనసేన తీసుకొస్తుందని జనసేనాని చెప్పారు.
గణాంకాలే చెబుతున్నాయి గ్రామాల్లో జనసేన బలంగా ఉందని – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/ADSqRw9Y8h
— JanaSena Party (@JanaSenaParty) February 16, 2021
మున్సిపల్ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలి- JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/breB8h6dkQ
— JanaSena Party (@JanaSenaParty) February 16, 2021