తిరుపతికి రాహుల్ : ప్రత్యేక హోదా భరోసా యాత్ర

  • Publish Date - February 22, 2019 / 03:19 AM IST

తిరుపతి : కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శుక్రవారం తిరుపతిలో జరిగే ‘ప్రత్యేక హోదా భరోసా యాత్ర’లో పాల్గోంటారు. ఢిల్లీ నుంచి ఉదయం 10.50కి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 11.20కి  అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు బయలుదేరి వెళ్ళి, మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం శ్రీకృష్ణ  గెస్ట్ హౌస్ లో భోజనం చేసి తిరిగి తిరుపతికి బయలుదేరతారు. 

సాయంత్రం 4.55 గంటలకు బాలాజీ కాలనీ లోని పూలే విగ్రహం సర్కిల్ నుంచి ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే  ‘ప్రత్యేక హోదా భరోసా యాత్ర’ రోడ్‌షోలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు తారకరామ క్రీడా మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. గత ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇదే సభా వేదిక పైనుంచే  ఏపీకి ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారు. శుక్రవారం అదే సభాస్ధలిలోని వేదికపై నుంచి బీజేపీ ఇచ్చిన హామీని, మాట మార్చిన వైనాన్ని ఎండగట్టనున్నారు.

రాహుల్‌ గాంధీతో పాటు పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి, కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వర, మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌,  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి కూడా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకోనున్నట్టు తెలుస్తోంది. రాహుల్‌గాంధీ కాలినడకన తిరుమల పర్యటన సందర్భంగా అలిపిరి నుంచి ఆలయం వరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.