వైసీపీలో జోష్ పెంచిన రాజ్యసభ ఎన్నికలు.. కేంద్రంలో చక్రం తిప్పేందుకు అవకాశం!

భవిష్యత్‌లో తన బలంతో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వైసీపీతో మంచి సంబంధాలు కొనసాగించాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఏ పార్టీ సాధించలేని ఘనతతో రికార్డును పదిలం చేసుకుంది వైసీపీ.

YCP History In Rajya Sabha

YSRCP : అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీలో జోష్‌ పెరిగింది. టెన్షన్‌ పుట్టించిన రాజ్యసభ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేసింది. ప్రతిపక్షాన్ని క్లీన్‌బౌల్డ్‌ చేసింది. ఇదే ఊపు వచ్చే ఎన్నికల్లో కొనసాగిస్తామని.. వన్స్‌మోర్‌ అంటూ మళ్లీ అధికారం చేపడతామని ఢంకా మోగించి మరీ చెబుతోంది ఫ్యాన్‌ పార్టీ.

పకడ్బందీ అడుగులతో గెలుపు ఏకగ్రీవం..
శాసనసభ ఎన్నికల ముందు శుభసూచకంగా మూడు రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకుంది వైసీపీ. 151 ఎమ్మెల్యేల బలంతో మూడు రాజ్యసభ స్థానాలను ఏకగ్రీవంగా గెలిచింది. వైసీపీ పక్కాగా గెలిచే చాన్స్‌ ఉన్నా.. గత రెండు నెలలుగా ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలతో ఏమైనా జరగొచ్చు అనే ప్రచారం వేడెక్కించింది. అధికార పార్టీ కూడా ఆ ప్రచారాన్ని తేలిగ్గా తీసుకోకుండా పకడ్బందీగా అడుగులు వేయడంతో నామినేషన్ల దశలోనే ప్రతిపక్షాలను నామమాత్రం చేయగలిగింది.

11కి పెరిగిన వైసీపీ బలం.. టీడీపీ చరిత్రలో ఇదే తొలిసారి
ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవం కావడంతో సభలో వైసీపీ బలం 11కి పెరిగింది. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులు అంతా ఒకే పార్టీ వారు కావడం ఓ రికార్డుగా మారింది. సీఎం జగన్‌ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు గత నలభయ్యేళ్లలో ఏ పార్టీ సాధించని ఘనతను తొలిసారిగా నమోదు చేశారు. వైపీసీ ఎఫెక్ట్‌తో ప్రతిపక్ష పార్టీ టీడీపీ చరిత్రలో తొలిసారి రాజ్యసభ సభ్యత్వం లేని స్థితికి చేరుకుంది. మరో రెండేళ్లవరకు ఆ పార్టీకి రాజ్యసభ సభ్యత్వం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. రెండేళ్ల తర్వాతైనా టీడీపీకి శాసనసభలో 44 మందికన్నా ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉంటేనే రాజ్యసభ ఆశలు నెరవేరే పరిస్థితి కనిపిస్తోంది.

అన్ని ఎన్నికలు ఏకపక్షం.. ఏకగ్రీవమే..
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఏకపక్షంగాను.. ఏకగ్రీవంగానే జరిగాయి. 151 ఎమ్మెల్యేల మద్దతుతో ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ తన అభ్యర్థులను గెలిపించుకోగలిగింది. ఏపీకి సభలో 11 రాజ్యసభ మంది సభ్యులు ఉండగా, ప్రస్తుతం వైసీపీ సభ్యుల సంఖ్య 9. ఇద్దరు సభ్యులు మాత్రమే ప్రతిపక్షాల నుంచి ప్రాతినిధ్యం వహించే వారు. ఈ ఇద్దరితోపాటు వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పదవీకాలం ఏప్రిల్‌ 2తో ముగియనుంది. ఈ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరగాల్సి వుండగా, మూడు స్థానాలకు ముగ్గురు మాత్రమే నామినేషన్లు వేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.

వచ్చే ఐదేళ్లలో కేంద్రంలోనూ చక్రం తిప్పనున్న వైసీపీ
మూడు స్థానాలు ఏకగ్రీవం కావడంతో రాజ్యసభలో వైసీపీ బలం 11కి పెరిగింది. అంటే వచ్చే రెండేళ్లు రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించేది కేవలం వైసీపీ మాత్రమే. 2019 ఎన్నికల్లో గెలుపుతో వైసీపీ ఏడేళ్లపాటు రాజ్యసభలో చక్రం తిప్పే అరుదైన అవకాశం దక్కించుకోగలిగింది. రెండేళ్ల తర్వాత కూడా రాజ్యసభలో వైసీపీ సభ్యులే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రెండేళ్ల తర్వాత ముగ్గురు సభ్యులు ఖాళీ చేసినా.. వైసీపీకి ఇంకా 8 మంది సభ్యుల బలం ఉంటుంది. దీనిద్వారా వచ్చే ఐదేళ్లలో కేంద్రంలోనూ చక్రం తిప్పనుంది వైసీపీ.

కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వైసీపీ మద్దతు అనివార్యం..!
కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడినా వైసీపీ మద్దతు అనివార్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా.. రాజ్యసభలో తగినంత బలం లేక ఇతర పార్టీలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ కారణంతోనే రాష్ట్రానికి బాసటగా నిలిచేలా కేంద్రంపై ఒత్తిడి తేగలిగింది వైసీపీ.. భవిష్యత్‌లో కూడా తన బలంతో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వైసీపీతో మంచి సంబంధాలు కొనసాగించాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఏ పార్టీ సాధించలేని ఘనతతో రికార్డును పదిలం చేసుకుంది వైసీపీ.

Also Read : సీఎం జగన్‌ వ్యూహం ఏంటి? ఎన్నికల్లో గెలుపు స్కెచ్‌ ఎలా ఉండబోతోంది

 

ట్రెండింగ్ వార్తలు