గంటా.. టీడీపీలో ఉండిపోవడానికి కారణం అదేనా..?

అందరి నోటా గంటా మాట.. ఏ గంటలో ఏ పార్టీలో చేరతారోననే మాట ఇంతకాలం వినిపించింది. తన గంట వైసీపీ ఆఫీసు ముందు మోగుతుందా? బీజేపీ ఆఫీసు ముందు

  • Publish Date - February 24, 2020 / 11:37 PM IST

అందరి నోటా గంటా మాట.. ఏ గంటలో ఏ పార్టీలో చేరతారోననే మాట ఇంతకాలం వినిపించింది. తన గంట వైసీపీ ఆఫీసు ముందు మోగుతుందా? బీజేపీ ఆఫీసు ముందు

అందరి నోటా గంటా మాట.. ఏ గంటలో ఏ పార్టీలో చేరతారోననే మాట ఇంతకాలం వినిపించింది. తన గంట వైసీపీ ఆఫీసు ముందు మోగుతుందా? బీజేపీ ఆఫీసు ముందు గణగణమంటుందా? అని అందరూ అనుకుంటుండగానే.. తన గంట శాశ్వతంగా టీడీపీ ఆఫీసు ముందే మోగుతుందని గంట కొట్టి మరీ చెప్పారు గంటా. గంట గంటకూ మలుపులు తిరిగిన గంటా పొలిటికల్‌ కెరీర్‌ ఇప్పుడు యూ-టర్న్‌ తీసుకోవడానికి కారణం ఏంటట?

ఎన్నికల తర్వాత నుంచి గంటా పార్టీ మార్పుపై ప్రచారం:
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఏం చేసినా సంచలనమే. ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడినప్పటి నుంచి ఆయన పార్టీ మారతారంటూ ప్రచారం జరిగింది. టీడీపీ హయాంలో మంత్రిగా పని చేసిన గంటా పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవటంతో సైలెంట్ అయ్యారు. ఒకపక్క అధికార వైసీపీ గంటాను టార్గెట్ చేసి, దాడులు చేస్తున్న నేపథ్యంలో బీజేపీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారనే ప్రచారం జరిగింది. ఆయనతో పాటు టీడీపీ శాసనసభ్యులను తీసుకెల్లి ఢిల్లీలో డైరెక్ట్‌గా జాయిన్ అవుతున్నట్లు ఆ నోటా ఈ నోటా వినిపించాయి. అంతే కాక టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనాచౌదరి, సీఎం రమేశ్‌లతో సంప్రదింపులు జరిపి, బీజేపీలో రాజ్యసభ సీటు కూడా సంపాదించుకుంటున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. కానీ, గంటా మాత్రం నవ్వుతూనే ఉండిపోయారు. పార్టీ మారలేదు.

గంటా స్కెచ్‌తో కంగుతిన్న బీజేపీ, వైసీపీ నేతలు:
ఇటీవల సీఎం జగన్ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించినప్పుడు గంటా శ్రీనివాసరావు స్వాగతించారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం మొదలైంది. అప్పుడు కూడా గంటా సైలెంట్‌గానే ఉండిపోయారు. అయితే ఇటీవల గంటా ఇచ్చిన షాక్‌కు అంతా బిత్తరపోయారు. సాధారణంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి చేరికలు ఎక్కువగా ఉంటాయి. కానీ, ఇక్కడ సీన్‌ రివర్సయ్యింది. గంటా సమక్షంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు దాదాపు 300 మంది టీడీపీలో చేరారు. వారందరికీ టీడీపీ కండువా కప్పి ఆహ్వానించారు. ఊహించని ఈ పరిణామంతో  అటు బీజేపీ, ఇటు వైసీపీతో పాటు సొంత పార్టీ నేతలు కూడా కంగుతిన్నారు. గంటా ఇచ్చిన ఝలక్‌తో ఆయన రూటే సెపరేటు అని అనుచరులు అంటున్నారు. 

జనసేన, వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు:
స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో బీజేపీకి గంటా షాక్ ఇచ్చారు. ఆ పార్టీలో ఉన్నవారికి పచ్చకండువా కప్పి ఆహ్వానించారు. అంతేనా ఇక్కడితో గంటా ఆగలేదు. బీజేపీ నుంచి టీడీపీలోకి నాయకులు, కార్యకర్తలు చేరడం మార్పునకు నాంది అని ఓ డైలాగ్‌ వేసేశారు. త్వరలో అన్ని పార్టీలు నుంచి వలసలుంటాయని బాంబు కూడా పేల్చారు. దీనితో జనసేన, వైసీపీ నేతలను సైతం టీడీపీలోకి తీసుకొచ్చేందుకు గంటా స్కెచ్‌ వేశారని టీడీపీ నేతలు సంబరపడిపోతున్నారట. గ్రేటర్‌ విశాఖతో పాటు స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గంటా రాజకీయ ఎత్తగడలకు ప్రత్యర్థులు చిత్తు అయిపోవడం ఖాయమని అంటున్నారు. 

See Also>>కుప్పంలో చంద్రాగ్రహం : ఇలాంటి చెత్త సీఎం చూడలే

శిష్యుడికి చెక్ చెప్పేందుకు గంటా ప్లాన్:
తాజా పరిణామాలతో టీడీపీలో గంటా మళ్లీ యాక్టివ్‌ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. కొద్ది కాలం వరకూ ఊగిసలాటలో ఉన్న గంటా సడన్‌గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద ఎత్తుగడే ఉందని గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పుడు పక్కా క్లారిటీతో చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. జిల్లాలో ఆధిపత్యానికి ప్రయత్నిస్తున్న తన శిష్యుడు, మంత్రి అవంతి శ్రీనివాసరావుకు చెక్‌ చెప్పేందుకు గంటా ప్లాన్‌ చేస్తున్నారని చెబుతున్నారు. మరోపక్క, గంటా కొత్త ఎత్తుగడలకు అడ్డుకట్ట వేయడానికి అవంతి కూడా ప్రయత్నాలు ప్రారంభించారట. గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ ఉత్తర నియోజకవర్గం అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు.

ప్రజలను రెచ్చగొడుతున్న అవంతి:
స్థానిక ఎమ్మెల్యే గంటా ఈ పనుల గురించి పట్టించుకోకుండా రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అవంతి ట్రై చేస్తున్నారట. నియోజకవర్గానికి గంటా వచ్చినప్పుడు నిలదీయాలంటూ ప్రజల్లో ఫిటింగ్‌ పెడుతున్నారట. అంతేనా.. మీ ఓట్లతో గెలిచి ఢిల్లీ, హైదరాబాద్‌ చుట్టూ తిరుగుతున్న గంటాను వదిలేస్తారా అంటు ప్రశ్నిస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, నియోజకవర్గంలో గంటాపై ఓడిపోయిన కేకే రాజు తన ఉనికి కోసం పోరాడుతున్నారు. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన రాజు.. మళ్లీ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

రాజకీయంగా రిస్క్‌లో పడడం ఎందుకనే యూ టర్న్‌?
ఇప్పటి వరకూ వైసీపీ, బీజేపీల్లోకి చేరేందుకు అన్ని మార్గాలను అన్వేషించిన గంటా శ్రీనివాసరావుకు.. ఆ పార్టీల్లో అవకాశం లేకపోవడంతో టీడీపీలోనే కొనసాగాలని భావించారట. అటూ ఇటూ చూసి రాజకీయంగా రిస్క్‌లో పడడం ఎందుకని, ఒకే పార్టీలో కొనసాగితే భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి వచ్చారంటున్నారు. అందుకే ఇప్పుడు ఇతర పార్టీల నుంచి ఒక్కొక్కరిని తన వైపు లాగే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. గ్రేటర్ మేయర్ పీఠాన్ని జగన్‌కు గిఫ్ట్‌ ఇవ్వాలని అన్ని వార్డుల్లో వైసీపీ నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తుంటే.. గంటా మాత్రం బయటకు రాకుండానే పనులను చక్కబెడుతున్నారు. భవిష్యత్తులో గంటా ఇంకా ఎలాంటి షాకులిస్తారో చూడాలని జనాలు అనుకుంటున్నారు.