10% Reservations to Girijans
10% Reservations to Girijans: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ‘గిరిజన బంధు’ అమలు చేస్తారని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. త్వరలోనే గిరిజన బంధు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. భూములు లేని గిరిజనులకు పోడు భూములు పంచుతామని కూడా చెప్పారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఆదివాసీ, బంజారా ఆత్మీయ సభలో కేసీఆర్ చేసిన ప్రకటనపై తెలంగాణ భవన్ లో మంత్రి సత్యవతి రాథోడ్ ఇవాళ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల గుండెల్లో నిలిచిపోతారని అన్నారు. గిరిజన బంధు విషయంలో కొందరు విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పారు. బీజేపీ ప్రతీదీ రాజకీయ కోణంలో చూడడం సరికాదని ఆమె అన్నారు. గిరిజనులను ప్రభుత్వానికి దూరం చేయాలని ఆ పార్టీ కుట్ర పన్నుతోందని చెప్పారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్య కూడా త్వరలోనే పరిష్కారం అవుతుందని అన్నారు. కాగా, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు అంశంపై కేసీఆర్ ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే రిజర్వేషన్ల శాతాన్ని 50 నుంచి 62 శాతానికి పెంచుతూ ప్రభుత్వం పంపిన బిల్లు కేంద్రం వద్ద నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉంది.