NCP vs NCP: ‘సివిల్ సర్వీసులో ఉన్నవారు 60 ఏళ్లకే రిటైర్ అవుతున్నారు. మీరు 83 ఏళ్లు ఉన్నారు. ఇంకెప్పుడు రిటైర్ అవుతారు?’ అంటూ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై బాబాయ్ శరద్ పవార్ ఘాటుగా స్పందించారు. తాను అలసిపోనని, రాజకీయాల నుంచి తప్పుకోనని ఆయన అన్నారు. నాసిక్ జిల్లాలోని యోలా నుంచి మహారాష్ట్ర పర్యటనను ప్రారంభించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్.. శనివారం నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ “మేము మహారాష్ట్ర వెలుపల కూడా ర్యాలీలు నిర్వహిస్తాము. నేను అలసిపోను, పదవీ విరమణ చేయను’’ అని పవార్ తేల్చి చెప్పారు.
ఇదిలావుండగా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేసిన, మంత్రి ఛగన్ భుజబల్ నియోజకవర్గం అయిన యోలా నుంచి శరద్ పవార్ తన రాష్ట్ర పర్యటన ర్యాలీని ప్రారంభించడం గమనార్హం. ఈ విషయమై ఎమ్మెల్యే జితేంద్ర అవద్ మాట్లాడుతూ “ప్రజలను కలుసుకుని పార్టీని పునర్ణిర్మిస్తాని శరద్ పవార్ చెప్పారు. ప్రజలు ఈ యోధుడికి వెన్నుదన్నుగా నిలుస్తారు. మీరందరూ ఆయనను అందుకోలేని ఘనమైన ఆదరణను చూస్తారు” అని అన్నారు. పలువురు ఎమ్యెల్యేలను వెంటపెట్టుకుని శివసేన-బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలిపారు. ఈ నేపథ్యంలోనే పవార్ రాష్ట్రవ్యాప్త ర్యాలీ చేపట్టారు.