×
Ad

Yanamala Krishnudu : టీడీపీకి బిగ్ షాక్..! వైసీపీలోకి యనమల కృష్ణుడు..!

అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్న యనమల కృష్ణుడు.. వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

  • Published On : March 13, 2024 / 07:41 PM IST

Yanamala Krishnudu To Join YSRCP

Yanamala Krishnudu : ఎన్నికల వేళ కాకినాడ జిల్లా తునిలో టీడీపీకి బిగ్ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ కీలక నేత యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 15న లేదా 17న వైసీపీ కండువా కప్పుకునేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. కృష్ణుడు రాకపై మంత్రి దాడిశెట్టి రాజాతో సీఎం జగన్ ఇప్పటికే చర్చించారు. తుని నుండి కృష్ణుడు రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. అయితే, ఈసారి తుని టికెట్ ను యనమల రామకృష్ణుడు కూతురికి టీడీపీ కేటాయించింది. దీంతో అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్న కృష్ణుడు.. వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనికి తోడు తన వర్గాన్ని యనమల రామకృష్ణుడు, ఆయన కూతురు దివ్య దూరం పెడుతున్నారని కృష్ణుడు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.

గోదావరి జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు సీఎం జగన్. అక్కడ రాజకీయంగా మెజార్టీ సాధిస్తే కచ్చితంగా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో అక్కడ కీలకమైన నేతలను (కాపు, బీసీ) తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. ఇప్పటికే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమైంది. నిజానికి రేపు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరాల్సి ఉంది. సీఎం జగన్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ నెల 15న లేదా 16వ తేదీన ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరబోతున్నారు.

మరో కీలక నేత, తుని నియోజకవర్గానికి చెందిన యనమల కృష్ణుడు సైతం వైసీపీ వైపు చూస్తున్నారు. ఆయన టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు. టీడీపీలో కీలకమైన నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు కుటుంబానికి చెందిన కృష్ణుడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో దాడిశెట్టి రాజా చేతిలో యనమల కష్ణుడు ఓటమిపాలయ్యారు. ఈసారి తుని టికెట్ ను యనమల కృష్ణుడికి కాకుండా యనమల రామకృష్ణుడు కూతురు యనమల దివ్యకు ఇచ్చారు చంద్రబాబు. అప్పటి నుంచి కూడా కృష్ణుడు పూర్తి అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో కృష్ణుడికి వైసీపీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Also Read : ఎన్నికల వేళ ఉండి నియోజకవర్గం టీడీపీలో మరింత ముదిరిన వివాదం