Karnataka Politics: కర్ణాటక శాసనసభాపక్ష నేతగా ఎంపికైన సిద్దరామయ్య
ఇక కాంగ్రెస్ పార్టీకి విపక్షంగా ఉన్న నేతల్ని కూడా పిలుస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌లను కూడా పిలుస్తున్నట్లు సమాచారం
- tony bekkal
- Published On : May 18, 2023 / 09:01 PM IST
CLP Leader: కర్ణాటక శాసనసభాపక్ష(Karnataka Legislative Assembly) నేతగా సిద్దరామయ్య (Siddaramaiah) ఎంపికయ్యారు. పార్టీ నేతలు రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, డీకే శివకుమార్ ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో బెంగుళూరులో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఇందులోనే సిద్ధరామయ్యను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. సిద్ధరామయ్య పేరును ఆర్వీ దేశ్‌పాండే, హెచ్‌కే పాటిల్, ఎంబీ పాటిల్, లక్ష్మీ హెబ్బాల్కర్ ప్రతిపాదించగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఏకపక్షంగా ఆమోదించారు.
ఇకపోతే కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య శనివారం ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. కర్ణాటకకు గతంలో (2013-2018) ఐదేళ్ల పాటు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రస్తుతం రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి దేశంలోని బీజేపీయేతర పక్షాలను పెద్ద ఎత్తున ఆహ్వానిస్తున్నారు ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే.
Karnataka Politics: అంతా పట్టుపట్టి మొదటికి వచ్చిన డీకే శివకుమార్.. అయితే ఒక్క షరతు
బిహార్ నుంచి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆర్జేడీ కీలక నేత తేజశ్వీ యాదవ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, సీపీఐ నుంచి డీ రాజా, సీపీఎం నుంచి సీతారాం ఏచూరిలను ఆహ్వానిస్తున్నారట. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల ఐక్యత సాధించే లక్ష్యంలో భాగంగా ఈ నాయకుల్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
Karnataka Politics: కాంగ్రెస్ అధిష్టానానికి కర్ణాటక సీనియర్ నేత తీవ్ర హెచ్చరిక
ఇక కాంగ్రెస్ పార్టీకి విపక్షంగా ఉన్న నేతల్ని కూడా పిలుస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌లను కూడా పిలుస్తున్నట్లు సమాచారం. నటుడు కమల్ హాసన్ ప్రత్యేక అతిథిగా హాజరు అవుతున్నారట. 224 మంది సభ్యుల అసెంబ్లీకి మే 10న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాలను కైవసం చేసుకొని ఘన విజయాన్ని సాధించింది. అధికార బీజేపీ, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ సెక్యులర్ 66, 19 స్థానాలను గెలుచుకున్నాయి.
