Karnataka Politics: కాంగ్రెస్ అధిష్టానానికి కర్ణాటక సీనియర్ నేత తీవ్ర హెచ్చరిక
2013 అసెంబ్లీ ఎన్నికల్లో తుమకూరు జిల్లా కొరటగెరె నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పరమేశ్వర ఓడిపోయారు. అప్పటికి ఆయన కేపీసీసీ చీఫ్. ఆ సమయంలో కూడా ఆయన ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు. కానీ తాను ఓడిపోవడంతో ఎమ్మెల్సీ ద్వారా సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రిగా చేరారు.

Dalit DCM: దళితుడికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే ప్రతికూల ప్రతిచర్యలు వస్తాయని, అది పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత జి పరమేశ్వర కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని హెచ్చరించారు. 2018లో కుమారస్వామి నేతృత్వంలోనే ఏర్పడిన కాంగ్రెస్-జెడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. పైగా ఆయన దళిత నేత. ఇక కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అతి ఎక్కువ కాలం పని చేసింది కూడా ఈయనే. ఎనిమిదేళ్ల పాటు కేపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు.
మూడు రోజులపాటు సాగిన ఉత్కంఠకు తెర దించుతూ సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా, డీకే శివకుమార్‌ను ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించిన కొద్ది గంటలకే పరమేశ్వర ఈ వ్యాఖ్యలు చేశారు. దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా అన్యాయం జరిగిందనే విషయమై ప్రజల్లో ముఖ్యంగా దళితులు భారీ చర్చ జరుగుతున్నట్లు ఆయన అన్నారు.
‘‘ప్రజల ఆలోచనలను అర్థం చేసుకుని మన నాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అది జరగకపోతే సహజంగానే దానికి ప్రతిచర్యలు వస్తుంటాయి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత తెలుసుకునే బదులు ఇప్పుడు సరిదిద్దుకుంటే బాగుంటుంది. లేదంటే అది పార్టీకి ఇబ్బంది కలిగించవచ్చు. అది అర్థం అయ్యేలా వారికి చెప్పాలనుకుంటున్నాను” అని పరమేశ్వర అన్నారు.
అయితే తాను కూడా ముఖ్యమంత్రి పదవికి ఆశపడ్డట్టు పరమేశ్వర చెప్పుకొచ్చారు. ‘‘నేను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కావాలని ఆశించాను. కానీ ఇప్పుడు మనం హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. రాబోయే రోజుల్లో వారు ఏమి చేస్తారో చూద్దాం. ప్రస్తుతానికి వారు ఇద్దరి గురించి ప్రకటనలు చేసారు. మరి మంత్రివర్గ విస్తరణలో ఎలాంటి న్యాయం చేస్తారో వేచి చూడాలి’’ అని అన్నారు.
2013 అసెంబ్లీ ఎన్నికల్లో తుమకూరు జిల్లా కొరటగెరె నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పరమేశ్వర ఓడిపోయారు. అప్పటికి ఆయన కేపీసీసీ చీఫ్. ఆ సమయంలో కూడా ఆయన ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు. కానీ తాను ఓడిపోవడంతో ఎమ్మెల్సీ ద్వారా సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రిగా చేరారు. దళితులు, లింగాయత్‌లు, మైనార్టీలు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అండగా నిలిచారని, 51 దళిత స్థానాల్లో 35 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించిందని చెప్పారు.
ఇదే కాకుండా రెండు జనరల్ స్థానాల్లో దళిత అభ్యర్థులు గెలుపొందారు. కాబట్టి తమ బలం 37 అని పరమేశ్వర అంటున్నారు. దళిత ఓట్లు అనేక ఇతర సెగ్మెంట్లలో ప్రభావం చూపాయని ఆయన చెప్పారు. 224 మంది సభ్యుల అసెంబ్లీకి మే 10న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 135 స్థానాలను కైవసం చేసుకొని ఘన విజయాన్ని సాధించింది. అధికార బీజేపీ, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ సెక్యులర్ 66, 19 స్థానాలను గెలుచుకున్నాయి.