నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ కీలక నాయకులు బీద సోదరులు గురించి జిల్లా రాజకీయాల్లో తెలియనివారు ఉండరు. టీడీపీలో కీలక నాయకులుగా ఎదిగిన పార్టీలో అనేక పదవులు అనుభవించారు. అయితే ఇప్పుడు రాజకీయంగా ఎవరిదారి వారిదే అయిపోయారు. లేటెస్ట్‌గా సీఎం జగన్ సంక్షేమ పథకాలు నచ్చడంతో ఆయన వైసీపీ కండువా కప్పుకుని ఆ పార్టీలో చేరారు. పార్టీ మారిన క్రమంలోనే బీదా మస్తాన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్‌లోనే ఎలక్షన్ మ్యానిఫెస్టోని భగవద్గీతగా చేసుకుని 85శాతం పనులు పూర్తి చేసిన ముఖ్యమంత్రి జగన్‌కు బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా.. సపోర్ట్ చేయాలని పార్టీలో చేరినట్లు చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న వైసీపీలో భాగస్వామ్యం అయ్యేందుకే భేషరతుగా.. పార్టీలో చేరినట్లు చెప్పారు. 1983నుంచి తెలుగుదేశం పార్టీలో లాయల్‌గా ఉన్నామని, నాయకుడు ఏది చెబితే అది చెయ్యడానికి పార్టీకి అంకితభావంతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
అంతేకాదు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న చిన్నాన్న కొడుకు తమ్ముడు బీదా రవిచంద్రను కూడా పార్టీలోకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తానని అన్నారు. లాయల్‌గా వీర సైనికుడిగా.. పార్టీలో పనిచేస్తానని అన్నారు.
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో బీద సోదరులైన బీద మస్తాన్ రావు, బీద రవిచంద్రలకు మంచి గుర్తింపు ఉంది. తెలుగుదేశం పార్టీ కోసం కీలకంగా పనిచేసిన నేతలుగా స్థానికంగా వారికి మంచి పేరుంది. ఇతర రాజకీయ పార్టీలకు ఏమాత్రం లొంగని నేతలుగా వీరు ఉన్నారు. పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారు. అటువంటిది నెల్లూరు రాజకీయాల్లో బీద లేని లోటు తెలుగుదేశం పార్టీకి కచ్చితంగా ఉంటుందని అంటున్నారు.