టీడీపీ- జనసేన ఫస్ట్ లిస్ట్ రెడీ.. టెన్షన్‌లో ఆశావహులు!

ఇప్పటికే హైదరాబాద్ నుంచి చంద్రబాబు, లోకేశ్ ఉండవల్లి చేరుకున్నారు. అటు జనసేనాని పవన్ కల్యాణ్ సైతం హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకున్నారు.

TDP Janasena First List : అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ-జనసేన కూటమి ఫస్ట్ లిస్ట్  నేడు (ఫిబ్రవరి 24) విడుదలయ్యే అవకాశం ఉంది. మంచి రోజు కావడంతో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయాలని నిర్ణయించారు. 60 నుంచి 70 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.

ఇప్పటికే హైదరాబాద్ నుంచి చంద్రబాబు, లోకేశ్ ఉండవల్లి చేరుకున్నారు. అటు జనసేనాని పవన్ కల్యాణ్ సైతం హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకున్నారు. పొత్తులు, ఉమ్మడి కార్యాచరణను వేగవంతం చేసే దిశగా టీడీపీ-జనసేన కూటమి కసరత్తు చేశాయి. వీలైనంత త్వరగా ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న దానిపై స్పష్టత ఇచ్చే దిశగా చర్యలు వేగవంతం చేశాయి రెండు పార్టీలు. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై ఇరువురు నేతలు పలుమార్లు సమావేశమై చర్చించిన సంగతి తెలిసిందే.

టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల జాబితాను ఉదయం 11 గంటల తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది. చాలా కాలంగా టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల జాబితా కోసం ఇరు పార్టీల నాయకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 7న చంద్రబాబు అమిత్ షాను కలిసిన తర్వాత కూటమి వ్యవహారాలు కొంత సైలంట్ కనిపించింది. నిన్నటి నుంచి కొద్దిగా స్పీడ్ అందుకున్నాయి. మొన్ననే సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెంలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చంద్రబాబు, లోకేశ్ గత నాలుగు రోజులుగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు.

అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు జరుగుతోంది. 60 నుంచి 70 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. ఎటువంటి వివాదం లేని సీట్లు మాత్రమే ప్రకటించే ఛాన్స్ ఉంది. బీజేపీ కూడా కూటమిలో చేరే అవకాశం ఉంది కాబట్టి.. కొన్ని సీట్లను బీజేపీ కోసం ఉంచే అవకాశం ఉంది. మరోవైపు జనసేనకు సంబంధించిన కొన్ని సీట్ల విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక, ఒకే సీటు కోసం ముగ్గురు నలుగురు పోటీ పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. అటువంటి స్థానాలను రెండో జాబితాలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి వివాదాలు లేని సీట్లను మాత్రమే తొలి జాబితాలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.

తొలుత ఫిబ్రవరి 14 మంచి రోజు అని, ఆ రోజున అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని చంద్రబాబు భావించారు. అయితే, బీజేపీ హైకమాండ్ నుంచి చంద్రబాబుకి పిలుపు రావడం, ఆయన అమిత్ షాతో చర్చలు జరపడం, అప్పటి నుంచి ప్రక్రియ ఆలస్యమైంది. ఇంకా ఆలస్యం అయితే, మరింత ఇబ్బంది వస్తుందన్న నేపథ్యంలో కొంత స్పీడ్ పెంచారు కూటమి సభ్యులు. వీలైనంత త్వరగా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తే.. అభ్యర్థులు రంగంలోకి దిగుతారు, ప్రచారం చేసుకుంటారు, పార్టీకి కొంత కలిసి వస్తుందని చంద్రబాబు భావించారు. ఈ క్రమంలోనే తొలి జాబితాను వెంటనే విడుదల చేసేయాలని చంద్రబాబు నిర్ణయించారు.

Also Read : సీఎం జగన్‌ వ్యూహం ఏంటి? ఎన్నికల్లో గెలుపు స్కెచ్‌ ఎలా ఉండబోతోంది

* ఉదయం 11 గంటల తర్వాత చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రెస్ మీట్..!
* అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్న చంద్రబాబు, పవన్
* 13 ఉమ్మడి జిల్లాలను టచ్ చేస్తూ తొలి జాబితా ఉండే అవకాశం
* 50కి పైగా టీడీపీ, 10కి పైగా స్థానాలనకు జనసేన అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్
* వివాదాలు లేని, క్లారిటీ ఉన్న స్థానాల అభ్యర్థులనే ప్రకటించనున్న చంద్రబాబు, పవన్
* ఎంపీ స్థానాల అభ్యర్థులపై రేపు క్లారిటీ ఇచ్చే అవకాశం లేదంటున్న కూటమి పార్టీలు

*టీడీపీ-జనసేన తొలి జాబితా వార్తలతో టెన్షన్‌లో టీడీపీ ఆశావహులు
* జాబితాలో తమ పేరు ఉంటుందో లేదోనని పలువురు సీనియర్ నేతల్లో టెన్షన్
* పొత్తులో భాగంగా తమ సీట్లు జనసేనకు ఎక్కడ వెళ్తాయోననే టెన్షన్‌లో నేతలు

పూర్తి వివరాలు..