TDP
TDP Leaders : తాము బలంగా ఉన్నప్పుడే.. తమ వారసులకు ఓ దారి చూపించాలనుకుంటున్న ఆ సీనియర్ పొలిటీషన్ల ఆశలు నెరవేరే పరిస్థితి లేదా? ఎమ్మెల్యేలుగా మంత్రులుగా రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆ నేతలు.. ఎందరికో రాజకీయంగా భవిష్యత్ చూపిన వారు తమ పిల్లల వద్దకు వచ్చేసరికి ముందడుగు వేయలేకపోతున్నారా? తాము తప్పుకుని తమ పిల్లలకు చాన్స్ ఇవ్వమన్నా అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించకపోవడానికి కారణమేంటి?
విశాఖ తెలుగుదేశం పార్టీకి మూల స్తంభాల్లాంటి ముగ్గురు నేతల వారసుల రాజకీయ ప్రవేశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. 30-40 ఏళ్లగా రాజకీయాల్లో కొనసాగుతున్న ఆ ముగ్గురు నేతలు తమ వారసుల రాజకీయ భవిష్యత్‌పై పార్టీ నుంచి ఎలాంటి హామీ పొందలేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పైకి చెప్పలేకపోతున్నా.. వారసుల రాజకీయ భవిష్యత్‌పై తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
విశాఖ జిల్లాలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, ఇక మరో మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు కూడా సీనియరే. ఈ ముగ్గురూ ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రభావం చూపగల నేతలు. ముగ్గురిదీ రాజకీయ కుటుంబమే కావడంతో వీరి వారసులు కూడా రాజకీయాల్లో చురుగ్గానే తిరుగుతున్నారు. అయ్యన్న కుమారుడు విజయ్ ఐటీడీపీ బాధ్యతల్లో పార్టీ క్రియాశీలంగా ఉండగా, బండారు కుమారుడు అప్పలనాయుడు, గంటా కుమారుడు రవితేజ స్థానిక రాజకీయాల్లో యాక్టివ్‌గా తిరుగుతున్నారు.
ఈ ముగ్గురు వారసులు ఈసారి ఎన్నికల్లో ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. తమకు అవకాశం ఇవ్వాలని పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ నేత అయ్యన్న తన మనసులో మాటను.. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు చెప్పేశారు. బహిరంగ వేదికపైనే ఈసారి తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని, అవసరమైతే తాను తప్పుకుంటానని కుండబద్దలు కొట్టారు అయ్యన్న.
Also Read : టార్గెట్ యాదవులు.. అన్ని పార్టీల గురి వారి ఓట్లపైనే, ఏపీలో సరికొత్త రాజకీయం
పార్టీలో అయ్యన్నపాత్రుడు సీనియర్. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ లైన్ ఏనాడూ దాటలేదు. పైగా గత నాలుగున్నరేళ్లుగా అధికార పార్టీపై వెన్నుచూపకుండా పోరాడుతున్నారు అయ్యన్నపాత్రుడు. వయసు పైబడటంతో తన స్థానంలో కుమారుడిని పోటీ చేయించాలని భావిస్తున్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అయ్యన్నపాత్రుడే పోటీ చేయాలని పట్టుబడుతున్నారు చంద్రబాబు. దీంతో తన కుమారుడికి ఎంపీగానైనా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు అయ్యన్న.
ఇక విజయ్ కూడా పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. పార్టీ సోషల్ మీడియా వింగ్ ఐటీడీపీకి సారధ్య బాధ్యతలు చూస్తున్న విజయ్.. ఈసారి చట్టసభలో అడుగుపెట్టాలని ఆశిస్తున్నారు. కానీ, పార్టీ అధినేత అనుగ్రహం పొందలేకపోతున్నారని టాక్ నడుస్తోంది. విజయ్ సామర్థ్యంపై అధినేతకు నమ్మకం ఉన్నా, ఆయన ఆశిస్తున్న అనకాపల్లి సీటుకు డిమాండ్ ఎక్కువగా ఉండటం, మిత్రపక్షం జనసేన కూడా అనకాపల్లిపై కర్చీఫ్ వేయడంతో ఈ సరికి అవకాశం దక్కే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నాయి పార్టీ వర్గాలు.
ఇక మరో ముఖ్య నేత గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజది ఇదే పరిస్థితి అంటున్నారు. టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన గంటా, 2019 ఎన్నికల తర్వాత కొన్నాళ్లు సైలెంట్ అయిపోయారు. గత ఏడాది నుంచి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా తిరుగుతున్న గంటా.. ఈసారి తనతోపాటు తన కుమారుడిని ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. తాను విశాఖ నగర పరిధిలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని, తన కుమారుడికి చోడవరం టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు గంటా.
మరోవైపు తన వియ్యంకుడు, మాజీమంత్రి నారాయణ ద్వారా అధినేత చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. నారాయణ అల్లుడైన రవితేజ ఇప్పటికే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా తిరుగుతున్నారు. చోడవరంలో గంటాకు వ్యక్తిగతంగా పట్టు ఉండటంతో అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచి చూపిస్తానని అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు.
Also Read : టీడీపీతో పొత్తు కుదిరితే.. బీజేపీ ఆశిస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ఇవే? అభ్యర్థులు కూడా ఖరారు?
ఇక మరోనేత బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు చాలాకాలంగా చురుగ్గా తిరుగుతున్నారు. చాన్స్ వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీ ఉన్నారు అప్పలనాయుడు. సత్యనారాయణమూర్తి టీడీపీలో చాలా సీనియర్ నేత. గతంలో మంత్రిగా పనిచేశారు. తాను తప్పుకుని కుమారుడిని కుర్చీ ఎక్కించాలని చూస్తున్న సత్యనారాయణమూర్తి ఆశలు ఈసారి నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. వీరి కుటంబానికే చెందిన కింజరాపు రామ్మోహన్‌నాయుడు శ్రీకాకుళం ఎంపీగా ఉన్నారు. ఆయన మళ్లీ పోటీ చేయడం ఖాయం. అంతేకాకుండా సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు కోరుతున్న పెందుర్తి సీటు జనసేన కూడా ఆశిస్తోంది. ఈ పరిస్థితుల్లో బండారు భవిష్యత్తే ఆగమ్యగోచరంగా తయారైంది.
విశాఖ జిల్లాలో టీడీపీ సంస్థాగతంగా బలంగా ఉంది. ఈ ముగ్గురు నేతల్లో ఇద్దరు గత ఎన్నికల్లో ఓడిపోగా, గంటా ఒక్కరే గెలిచారు. ఒకసారి గెలిచిన నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేయని గంటా ఈసారి కొత్త నియోజకవర్గం వెతుక్కునే పనిలో ఉంటూనే కుమారుడికి చోడవరం సీటు గట్టిపరిచేలా పనిచేస్తున్నారు. ఇక అయ్యన్ననే మళ్లీ పోటీ చేయాలని పార్టీ కోరుతుండటంతో విజయ్, జనసేన రూపంలో బండారు అప్పలనాయుడుకు ఇప్పట్లో అవకాశాలు దక్కే పరిస్థితి కనిపించడం లేదని టాక్ నడుస్తోంది.