టీడీపీ తీసుకొచ్చిన పసుపు-కుంకుమ అపవిత్రంగా వ్యాఖ్యానించారు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. టీడీపీకి రాజీనామా చేసి.. జగన్ తో భేటీ అయ్యారు ఆయన. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ 10 సంవత్సరాల రాజధానిగా ఉందని.. చంద్రబాబు ఎందుకు పారిపోయి వచ్చాడు అని ప్రశ్నించారు. చీరాల నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాలు.. ప్రభుత్వ కార్యకలాపాల్లో బయటి శక్తుల ప్రమేయం పెరిగిందని విమర్శించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఎలాంటి కండీషన్స్ పెట్టలేదని చెప్పుకొచ్చారు. ప్రతి అంశం సామాజిక అంశంతో ముడిపడి ఉందని.. రాజకీయం అంశం కావడం ఇష్టం లేదన్నారు. వీటన్నింటినీ బేరీజు వేసుకుని టీడీపీలో కొనసాగటం కరెక్ట్ కాదనే నిర్ణయానికి వచ్చి.. పార్టీ మారినట్లు వివరించారాయన. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను కాదని.. తాను ఇండిపెండెంట్ అన్న విషయాన్ని గుర్తు చేశారు. స్వతంత్ర్య అభ్యర్థి ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. జనసేన పార్టీలో చేరుతానని వస్తున్న వార్తల్లో స్పష్టత లేదని.. కానీ పవన్‌తో పలు అంశాలు చర్చించినట్లు తెలిపారు. టీడీపీకి గుడ్ బై చెప్పడం వెనక ఎన్నో కారణాలున్నాయన్నారు.
టీడీపీ అట్టహాసంగా చేపడుతున్న పసుపు – కుంకుమ కార్యక్రమాన్ని సర్వనాశనం చేస్తున్నారని.. డ్వాక్రా సంఘాలకు వడ్డీ రాయితీనే ఇవ్వలేదని చెప్పారు. రూ.6వేల 500 కోట్లు బకాయిల సంగతి ఏంటని నిలదీశారు. రోజుకో మాట చెబుతూ 10 మంది చేత బాబు గొప్పలు చెప్పించుకుంటున్నారని ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. ఆమంచి వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్ల ఎలా స్పందిస్తారో చూడాలి.