ఒక్క దెబ్బతో : టీడీపీ కేడర్ కు హీరోగా మారిన సీనియర్ లీడర్

రాష్ట్ర రాజకీయాలలో ఆయనకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. 37 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు అనుభవించిన ఆయన.. ఇప్పుడు సడన్‌ గా పార్టీ కేడర్‌ దృష్టిలో హీరో

  • Publish Date - January 31, 2020 / 01:31 PM IST

రాష్ట్ర రాజకీయాలలో ఆయనకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. 37 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు అనుభవించిన ఆయన.. ఇప్పుడు సడన్‌ గా పార్టీ కేడర్‌ దృష్టిలో హీరో

రాష్ట్ర రాజకీయాలలో ఆయనకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. 37 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు అనుభవించిన ఆయన.. ఇప్పుడు సడన్‌ గా పార్టీ కేడర్‌ దృష్టిలో హీరో అయిపోయారు. వివాదరహితుడిగా గుర్తింపు పొందిన ఆయన.. ఇప్పుడు ఏపీ రాజకీయాలకు కేంద్ర బిందువయ్యారు. ప్రత్యర్థి పార్టీలు విరుచుకుపడుతున్నా… తనదైన శైలిలో రూల్స్‌తో కన్‌ఫ్యూజ్‌ చేసేసి ఆత్మరక్షణలో పడేస్తారాయన. కేడర్‌కు దూరంగా ఉంటారనే అపవాదు మూటగట్టుకున్న ఆ ప్రతిపక్ష పార్టీ నేత.. ఇప్పుడు అదే కేడర్‌తో జేజేలు కొట్టించుకుంటున్నారు. ఎవరా నేత? ఏం చేసి హీరోగా మారారు?

37 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు:
టీడీపీ సీనియర్ నేత, శాసనమండలిలో టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు మళ్లీ యాక్టివ్‌ అయ్యారు. 37 ఏళ్ల రాజకీయ జీవితంలో రాష్ట్ర స్థాయిలో ప్రతి పదవిని ఆయన అనుభవించారు. పదవి లేకుండా ఖాళీగా ఉన్నది లేదు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఆరుసార్లు తుని నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009 ఓటమి తర్వాత శాసనమండలికి ఎన్నికయ్యారు. ప్రస్తుతం రెండోసారి శాసనమండలి సభ్యుడిగా పని చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రుడు. ఆయన ఏ పని చేయాలన్నా యనమలకు చెప్పకుండా చేయరనే టాక్‌ ఉంది. 

పార్టీలో చంద్రబాబు తర్వాత నెంబర్ 2:
పార్టీలో ఎమ్మెల్సీల దగ్గరు నుంచి రాజ్యసభ సభ్యులు వరకు ఏ పదవి ఎవరికి ఇవ్వాలన్నా.. యనమలతో చర్చించాకే చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని చెబుతారు. పార్టీలో చంద్రబాబు తర్వాత ఆ స్థాయి గౌరవ మర్యాదలు అందుకునే వ్యక్తి యనమల అని చెప్పుకోవచ్చు. అయితే, పార్టీలో మాత్రం యనమలకు అంత ప్రాధాన్యత అవసరమా అని ఆయనకి గిట్టని వారు చర్చను లేవదీసేవారట. ఆయన సొంత ఇమేజ్ పెంచుకోవడానికి పని చేస్తారు తప్పించి పార్టీ కోసం పని చేయరని, కేడర్‌ను పట్టించుకోరని పార్టీలో టాక్‌. 

యనమలతో సెల్ఫీల కోసం క్యూ:
ఇదంతా గతం.. ఇప్పుడంతా పూర్తిగా రివర్స్. ప్రస్తుతం యనమల పేరు చెబితేనే కార్యకర్తలంతా సంబరపడిపోతున్నారు. ఆయన ఎక్కడ కనపడినా ఎగబడి సెల్ఫీలు దిగుతున్నారట. రిపబ్లిక్ డే రోజు టీడీపీ కార్యాలయంలో గంటపాటు కార్యకర్తలతో సెల్ఫీలు దిగారు యనమల. దీనంతటికీ కారణం శాసనమండలిలో యనమల చేసిన పోరాటమేనని అంటున్నారు. ఈ ఒక్క అంశంతో ఆయన క్యాడర్ లో హీరో అయ్యారని చెప్పుకుంటున్నారు. శాసనమండలిలో రూల్ 71 దెబ్బకు అధికార పార్టీ  బిత్తరపోయిందని, శాసనమండలిలో ప్రభుత్వాన్ని, మంత్రులను రూల్స్‌తో కన్‌ఫ్యూజ్ చేసి టీడీపీ ప్రతిష్టను ఇనుమడింపజేశారు. ఇప్పుడు తమ నాయకుడు ఫామ్‌లోకి వచ్చారని సంబరపడిపోతున్నారట తెలుగు తమ్ముళ్లు.

శాసనమండలి రద్దు అంశంపై కూడా ప్రభుత్వాన్ని యనమల గట్టిగా టార్గెట్ చేశారని అంటున్నారు. యనమల వేసే చురకలతో అధికార పార్టీ భంగపాటుకు గురైందని భావిస్తున్నారు. యనమల రామకృష్ణుడిలో పూర్తి మార్పు వచ్చిందని క్యాడర్‌తో కలసిమెలసి తిరుగుతున్నారని అనుకుంటున్నారు. ఇక తమకు తిరుగులేదని తెగ సంబరపడిపోతున్నారట. మొత్తం మీద మూడు రాజధానుల వ్యవహారం, శాసనమండలి రద్దు అంశం యనమలకు బాగా కలసి వచ్చిందని జనాలు అనుకుంటున్నారు.