Congress CPM Talks : కాంగ్రెస్‌కు మద్దతివ్వండి.. సీపీఎం నేతలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

అసెంబ్లీ ఎన్నికల్లో మేము అడిగిన సీట్లు కాంగ్రెస్ ఇవ్వలేక పోయింది. సీట్లు ఇవ్వడం అప్పుడు కుదరలేదు. అంత మాత్రాన కలిసి పని చేయలేదు అనుకోవద్దు.

Congress CPM Talks : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీపీఎం రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతివ్వాలని సీపీఎం నేతలను కోరారు భట్టి. నిన్న కేరళలో సీపీఎంకు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత భట్టి విక్రమార్క సీపీఎం కార్యాలయానికి వెళ్లడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేరళలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సీపీఎం శ్రేణులు మండిపడుతున్నాయి.

పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపొందేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. సీపీఎం మద్దతు కూడగట్టేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్యలు చేపట్టారు. సీపీఎం రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి తమ్మినేని వీరభద్రంతో పాటు పలువురు ముఖ్య నాయకులతో భట్టి సమావేశం అయ్యారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
ఇండియా కూటమి మిత్రపక్షంగా సీపీఎం ఉంది. అందులో భాగంగానే ఆ పార్టీ మద్దతు అడిగేందుకు ఈరోజు రాష్ట్ర నాయకత్వాన్ని కలిసి మద్దతు కోరేందుకు వచ్చాము. గత అసెంబ్లీ కలిసి పని చేయాలని భావించాం. కానీ కుదుర లేదు. జాతీయ పార్టీ అదేశాల మేరకు సీపీఎం పార్టీ శ్రేణులను కలుస్తాం. మద్దతు అంశంపై ఆ పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడి చెబుతామని హామీ ఇచ్చారు. సీపీఎం మద్దతు తమకే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము.
అసెంబ్లీ ఎన్నికల్లో వారు అడిగిన సీట్లు ఇవ్వ లేకపోయాం. భవిష్యత్ లో మా వంతు సహాయసహకారాలు ఉంటాయి.

తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
పార్లమెంట్ ఎన్నికల్లో మా మద్దతు కోరేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మా వద్దకు వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి మినహా అన్ని స్థానాల్లో మా మద్దతు కలిసి వచ్చే పార్టీలకే అని నిర్ణయించాయి. తెలంగాణలో బీజేపీని ఓడించడమే మా లక్ష్యం. బీజేపీని ఏ పార్టీ ఢీకొట్టగలదో వారికే మా మద్దతు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి మా సహకారం ఉంటుంది. కేరళలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి కమ్యూనిస్టులు సహకరిస్తున్నారని మాట్లాడటం సరైంది కాదని ఖండించాం. ఎక్కడ నిర్ణయం అక్కడే ఉంటుంది. తెలంగాణలో బీజేపీ గెలవద్దనదే మా లక్ష్యం.

అసెంబ్లీ ఎన్నికల్లో మేము అడిగిన సీట్లు కాంగ్రెస్ ఇవ్వలేక పోయింది. సీట్లు ఇవ్వడం అప్పుడు కుదరలేదు. అంత మాత్రాన కలిసి పని చేయలేదు అనుకోవద్దు. కచ్చితంగా కాంగ్రెస్ తో కలిసి పని చేస్తాం. మా మద్దతు ఉంటుంది. శనివారం మరోసారి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వంతో మాట్లాడతామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పని చేసేందుకు ఒక నిర్ణయానికి వస్తాము.

Also Read : హైటెన్షన్ వైరు లాంటోడిని, ముట్టుకుంటే మాడిపోతావ్- కేసీఆర్‌కు సీఎం రేవంత్ వార్నింగ్

ట్రెండింగ్ వార్తలు