ఆ ముగ్గురు మంత్రుల మైండ్‌లో రివెంజ్‌ !

  • Publish Date - January 6, 2020 / 02:10 PM IST

ఏడాది కిందట జరిగిన ఘటనపై ముగ్గురు మంత్రులు సీరియస్‌గా ఉన్నారట. కొంత మంది చేసిన గాయానికి వారు ఇప్పటి వరకు లోలోపల పగతో రగిలిపోతున్నారంటున్నారు. ఇంకా వేచి చూస్తే మంచిది కాదనుకున్నారో ఏమో గానీ అదను చూసి దెబ్బ కొట్టాలని డిసైడ్ అయ్యారట.

మంత్రులు ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోబోతున్నారట. శత్రువు ఎవరో తెలిసినా ఏడాది కాలంగా మౌనంగా ఉన్న మంత్రులు… ఇంకా ఆలస్యం చేయకుండా తమ ఆపరేషన్ మొదలు పెట్టారని కార్యకర్తలు గుసగుస లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రుల నుంచి తమకు ఎదురు కాబోయే ఎదురుదెబ్బలు తలచుకొని ఆ నేతలు ఆందోళన చెందుతున్నారట.

వేర్వేరుగా ప్లాన్లు వేసినా :
నమ్మకద్రోహం, వెన్నుపోటు, విశ్వాసం.. ఈ మూడు ముగ్గురు మంత్రులకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టాయి. ఎన్నికల సమయంలో ముగ్గురు నేతలను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించి, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టిన వారిని శిక్షించడానికి ముగ్గురు మంత్రులు వేర్వేరుగా ప్లాన్ చేశారట. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఈ ముగ్గురికీ గుణపాఠాన్ని నేర్పించాయంటున్నారు. ఎన్నికల్లో తమకు అనుచరులుగా ఉన్న వారంతా పోలింగ్‌కు ముందు వ్యతిరేకులుగా మారి ఓడించే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ఎవరినీ దూరం పెట్టలేక, నిందించలేక సైలెంట్‌గా ఉండిపోయారట. ఎలాగో కిందా మీదా పడి ఎన్నికల్లో విజయం సాధించారు.

పగతీర్చుకునే పనిలో బిజీ :
సీనియారిటీ, పార్టీ విధేయత కోటాలో మంత్రి పదవులు కూడా సంపాదించుకున్నారు ఈటెల, కొప్పుల, గంగుల. ఇప్పుడు వెన్నుపోటుదారులపై పగ తీర్చుకునే పనిలో పడ్డారంటున్నారు. ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తాననే ధీమాతో ఉన్నారు. మంత్రి పదవి ఎలాగైనా వస్తుందని జోష్‌లో ముమ్మర ప్రచారం చేశారు. తీరా సమయానికి ఈశ్వర్‌కి అనుకూలంగా ఉన్నవారంతా ఓ మాజీ ఎంపీకి అమ్ముపోయారట. దీంతో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు ఈశ్వర్ తక్కువ మెజారిటీతో గట్టెక్కారు. అప్పటి వరకు అందరినీ గుడ్డిగా నమ్మిన ఈశ్వర్… ఇప్పుడు తన మార్క్ రాజకీయాలు చేస్తూ నమ్మకద్రోహులను హడలెత్తిస్తున్నారట.

మరోపక్క, ఈటెలను ఓడించేందుకు కూడా కొందరు నేతలు పని చేశారట. పదవుల కోసం ఈటెల చుట్టు తిరగడం… పదవులు రాగానే ఆయనకు తలనొప్పిగా మారడం హుజూరాబాద్ రాజకీయాల్లో సాధారణమైందట. ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికల్లో నమ్మకం ద్రోహం చెసిన వారికి టికెట్లు ఇవ్వడం కుదరదంటూ ఈటెల బహిరంగ ప్రకటన చేశారు. అలానే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను నమ్మిన వారే వెన్నుపోటు పొడిచారంటున్నారు. వారెంత ప్రయత్నించినా గంగుల గెలిచి, మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇప్పుడు తనకు వ్యతిరేకంగా పని చేసిన వారి ఆటకట్టించే పనిలో పడ్డారట.

వెన్నుపోటుదారుల లిస్ట్ రెడీ :
మంత్రులు ఈటెల, కొప్పుల, గంగులకు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల రూపంలో శత్రువులను పక్కన పెట్టే అవకాశం దక్కిందంటున్నారు. వ్యతిరేకులు, నమ్మక ద్రోహులు, వెన్నుపోటుదారుల లిస్ట్ తయారు చేసుకున్న మంత్రులు… వారికి టికెట్ రాకుండా జాగ్రత్త పడుతున్నారట. వారిని పొలిటికల్‌గా దెబ్బ తీసేందుకు పక్కా ప్లాన్ చేశారట. ఇప్పుడు ఈ మంత్రుల జాబితాలో ఉన్నవారెవరో తెలియదు గానీ.. అటువంటి వారంతా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారాట. ఈ దెబ్బకు వారి రాజకీయ ఎదుగుదలకు ఇబ్బందులు తప్పవని పార్టీలో డిస్కస్‌ చేసుకుంటున్నారు.