ఏపీలో ఇద్దరు మంత్రుల రాజీనామాతో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవి దక్కించుకోవడానికి అనంతపురం జిల్లా నేతలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ముగ్గురు నేతలు హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకునేందుకు లాబీయింగ్‌లో స్పీడ్ పెంచారు. గడిచిన ఎన్నికల్లో అనంతలో ఉన్న 14 స్థానాలకు గాను 12 స్థానాల్లో వైసీపీ గెల్చుకుంది.
పార్టీ అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించింది. దీంతో రాజకీయ సమీకరణాలు, సామాజిక వర్గాల లెక్కలు సరిచూసుకొని… మొదట ఏర్పడిన మంత్రివర్గంలో జిల్లా నుంచి ఒకరికి అవకాశం కల్పించారు సీఎం జగన్. అది కూడా బీసీ వర్గానికి చెందిన నేతకే అవకాశమిచ్చారు. అప్పుడు మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నాయకులు… మళ్లీ ఇప్పుడు లాబీయింగ్ మొదలు పెట్టారు.
ఆయనకు మంత్రి పదవి వస్తే..
జిల్లాలో సీనియర్ నాయకుడైన అనంత వెంకటరామిరెడ్డితో పాటు రాప్తాడు ఎమ్మల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్… మంత్రివర్గంలో చోటుపై ఆశలు పెట్టుకున్నారు. ఎవరికి వారు జగన్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేసుకొంటున్నట్టు సమాచారం. జిల్లా నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాగా… ముగ్గురు బీసీలు, ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు.
వారిలో దివంగత నేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి అనంత వెంకటరామిరెడ్డి అత్యంత సన్నిహితుడు. 4సార్లు ఎంపీ గెలిచిన అనుభవం ఆయన సొంతం. జిల్లా మీద పూర్తిస్థాయిలో పట్టున్న సీనియర్ నేత కావడం బోనస్. ఆయనకు మంత్రి పదవి వస్తే జిల్లా అభివృద్ధి చెందడమే కాకుండా… వైసీపీ బలం మరింత పెరుగుతుందని ఆయన అనుచరులు ఆశలు పెట్టుకున్నారు.
మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న మరో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి. గత ఎన్నికల్లో పరిటాల కంచుకోటను బద్దలుకొట్టిన రికార్డ్ ఆయన సొంతం. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లా సమస్యలు, నియోజకవర్గ ఇబ్బందుల్ని అధిష్టానం దృష్టికి తీసుకుపోతూ… ప్రతిపక్ష పార్టీకి గట్టిగా కౌంటర్లు ఇస్తూ దూసుకుపోతున్నారు తోపుదుర్తి.
పార్టీ కేడర్‌ను కూడా ముందుండి నడిపిస్తున్నారు. అంతేకాకుండా ఏడాదిలోపే పేరూరు డ్యాంకు కృష్ణా జలాల్ని తీసుకొచ్చి రైతుల ఏళ్లనాటి కలను నిజం చేసిన నాయకుడిగా మంచిపేరు తెచ్చుకున్నారు. దీంతో యువ నాయకుడికి మంత్రి పదవిస్తే… జిల్లా అభివృద్ధితో పాటు పార్టీని మరింత ముందుకు నడిపిస్తారన్న ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు.
బీసీ వర్గానికి కేటాయిస్తారని.. :
కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉషాశ్రీ చరణ్ కూడా మంత్రి పదవిపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. బీసీ సామాజికవర్గం కావడం ఆమెకు బోనస్. ఇప్పటికే రాజీనామా చేసిన ఇద్దరు మంత్రులూ బీసీలే కావడంతో… ఉషశ్రీకి కలిసొచ్చే అవకాశముంది. ఆమె భర్తకు బళ్లారి మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డితో మంచి సంబంధాలుండటం… ఉషశ్రీకి ఉపయోగపడుతుందని అనంతలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఖాళీ అయిన రెండు మంత్రి పదవుల్ని బీసీ వర్గానికే కేటాయించే అవకాశముందన్న ప్రచారంతో… ఉషశ్రీ చరణ్ లాబీయింగ్ ముమ్మరం చేశారు. మొత్తానికి ఈ ముగ్గురిలో ఎవరికి అమాత్య పదవి దక్కుతుందో.. ఎవరి ఆశలపై అధిష్టానం నీళ్లు చల్లుతుందో తెలియాలంటే… మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.