హ్యాండిచ్చారు : అశ్వత్థామరెడ్డి డ్యూటీ ఎక్కాల్సిందే

  • Publish Date - January 5, 2020 / 07:00 AM IST

ఆర్టీసీ యూనియన్ల జేఏసీ కన్వీనర్, TMU అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డికి TS RTC యాజమాన్యం భారీ షాకిచ్చింది. MGBSలో కంట్రోలర్ గా ఉన్న అశ్వత్థామ.. సమ్మె విరమించిన అనంతరం సెలవు ఇవ్వాలంటూ పెట్టుకున్న దరఖాస్తులను యాజమాన్యం నిరాకరించింది. అక్టోబర్ 5నుంచి నవంబర్ 25వరకు 55 రోజులు సమ్మె చేసిన కార్మికులు.. ఆ తర్వాత సీఎం ప్రకటనతో విధుల్లో చేరిపోయారు. అయితే సమ్మె విరమించిన అనంతరం అశ్వత్థామరెడ్డి తనకు ఆరు నెలలు (డిసెంబర్ 6నుంచి 2020 సంవత్సరం మే 5వ తేదీ) వరకు సెలవు మంజూరు చేయాలని డిసెంబర్ 5వ తేదీన దరఖాస్తు చేసుకున్నారు.

అయితే సెలవు ఇవ్వలేమని, విధుల్లో చేరాలని తెలియజేస్తూ ఎంజీబీఎస్ నోటీసు బోర్డుపై కస్టమర్ రిలేషన్స్ మేనేజర్ పేరిట తిరస్కరణ లెటర్ ను పెట్టారు. ఈ విషయంపై అధికారులు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అశ్వత్థామరెడ్డి విమర్శించారు. 

చివరగా తనకు 6 నెలల పాటు వేతనం లేకుండా సెలవు మంజూరు చేయాలని అశ్వత్థామరెడ్డి మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. దీనిని కూడా ఆర్టీసీ యాజమాన్యం తిరస్కరించినట్లు ప్రకటించింది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లడానికి అశ్వత్థామే కారణమని ప్రభుత్వం అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అశ్వత్థామ ఆరోపిస్తుండగా.. మరోవైపు సంస్థ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సెలవు ఇవ్వడం కుదరదంటూ యాజమాన్యం చెప్పుకొస్తుంది.

Read More : చార్మినార్ వద్ద జాతీయ జెండాను ఎగురవేయనున్న ఓవైసీ