ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇవాళ్టితో 50 రోజులకు చేరింది. బేషరతుల్లేకుండా విధుల్లోకి తీసుకుంటామని జేఏసీ ప్రకటించి 3 రోజులవుతోంది. కానీ.. కార్మికుల భవితవ్యంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకోవాలనే అభిప్రాయంతో ఉన్నా.. తుది నిర్ణయానికి మరో నాలుగైదు రోజులు టైం పడుతుందని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రజారవాణా వ్యవస్థను సమూలంగా మార్చాలనే లక్ష్యంతో ఉన్న సీఎం కేసీఆర్.. 50 శాతం రూట్లను ప్రైవేటీకరించాలనే నిర్ణయం తీసుకున్నారు.
భవిష్యత్‌లో ఆర్టీసీ బస్సులు.. ప్రైవేట్ ఆపరేటర్లతో పోటీ పడుతూ పనిచేసే వాతావరణాన్ని కల్పించేందుకు.. ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 50 వేల మంది కార్మికులున్నారు. ఇప్పుడు.. 5 వేల 100 రూట్లు ప్రైవేట్ ఆపరేటర్లకు ఇస్తే.. ఆర్టీసీ సిబ్బంది వ్యవహారం సంస్థకు భారంగా మారనుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. కార్మికులను తిరిగి విధుల్లో చేర్చుకునే అంశంపై సర్కార్ ఆచితూచి వ్యవహరిస్తోంది. అందుకే.. తుది నిర్ణయం ఇంకా వెలువరించడం లేదన్న ప్రచారం జరుగుతోంది.
కార్మికులందరినీ విధుల్లోకి తీసుకొని.. వారిలో 50 ఏళ్లు పైబడిన వారికి స్వచ్ఛంధ పదవీ విరమణ అవకాశాన్ని కల్పించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే రెండేళ్లలో దాదాపు 20 వేల మంది కార్మికులు రిటైర్ కానున్నారు. దీంతో.. సంస్థలో మిగిలిన 50 శాతం బస్సుల నిర్వహణకు సిబ్బంది సరిపోతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కార్మికులు గనక వీఆర్ఎస్‌కు ముందుకు వస్తే.. వారికి భారీ స్థాయిలో వరాలు కురిపించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటికే.. ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశాన్ని హైకోర్టు.. లేబర్ కోర్టుకు బదిలీ చేసింది. రూట్ల ప్రైవేటీకరణకు కూడా హైకోర్టులో రూట్ క్లియర్ కావడంతో.. ఒకేసారి ఈ మొత్తం సమస్యకు ముగింపు పలకాలని ప్రభుత్వం భావిస్తోంది. ఐతే.. బేషరతుగా విధుల్లోకి చేర్చుకోవాలన్న కార్మికుల ప్రతిపాదనపై.. సర్కార్ కొంచెం సీరియస్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో.. సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని కార్మికులు పట్టించుకోకపోవడంతో.. ఇప్పుడు ప్రభుత్వం పెట్టే షరతులకు లోబడి విధుల్లో చేరాలనే ప్రతిపాదన తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు. మరో మూడు, నాలుగు రోజుల్లో కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుందని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Read More : ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ..లాభమా ? నష్టమా ?