ఆర్టీసీ సమ్మె ఓ కొలిక్కి రావడం లేదు. షరతులు లేకుండా ఉంటే..తాము విధుల్లోకి హాజరవుతామని, సమ్మెను విరమిస్తున్నట్లు..ఆర్టీసీ జేఏసీ వెల్లడించింది. ఆర్టీసీ కార్మికుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై.. ప్రభుత్వం 2019, నవంబర్ 21వ తేదీ గురువారం విస్తృత చర్చ జరిపింది. ఆర్టీసీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, కోర్టు నిర్ణయాలు, కోర్టులో ఇంకా నడుస్తున్న కేసుల అంశాలపై.. పూర్తిగా అధ్యయనం చేయాలని సర్కార్ నిర్ణయించింది. రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు తీర్పు తర్వాతే.. తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం డిసైడైంది.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఆర్టీసీపై 5 గంటల పాటు ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో రవాణా మంత్రి పువ్వాడ అజయ్, సీఎస్, సునీల్ శర్మ సహ.. ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీకి ఇప్పటికే 5 వేల కోట్లకు పైగా అప్పులున్నాయని.. అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు దాదాపు 2 వేల కోట్ల వరకు ఉన్నాయని తెలిపారు. పీఎఫ్ అధికారుల ఆదేశం మేరకు.. కార్మికులకు సెప్టెంబర్‌కు సంబంధించిన మొత్తం జీతం చెల్లించాలంటే రూ. 240 కోట్లు కావాలి. సీసీఎస్‌కు రూ. 500 కోట్లు ఇవ్వాలి. వీటికి తోడు డీజిల్, రెండేళ్లుగా ఉన్న రవాణా పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంది. పైగా.. కాలం చెల్లిన బస్సుల స్థానంలో 2 వేల 6 వందల కొత్త బస్సులు కొనాల్సి ఉంది. పీఎఫ్ బకాయిల కింద నెలకు రూ. 65 నుంచి రూ. 70 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నింటిని.. ఆర్టీసీ ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
మొత్తంగా.. ఆర్టీసీ ఇప్పుడున్నట్లుగా నడవాలంటే నెలకు రూ. 640 కోట్లు కావాల్సి ఉంటుంది. అందువల్ల.. ఈ భారమంతా ఎవరు భరించాలనే విషయంపై చర్చ జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీకి అంత శక్తి లేదని.. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదని సమీక్షలో తేల్చారు. ప్రభుత్వం ఎంతో కొంత సాయం చేసినా.. నష్టాల నుంచి బయటపడే అవకాశం లేదన్నారు. ఇక..ఆర్టీసీకి ఉన్న ఒకే ఒక్క మార్గం బస్సు చార్జీలు పెంచడం. చార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుందన్నారు.
ఈ పరిస్థితులన్నీ.. పరిగణనలోకి తీసుకుంటే.. ఆర్టీసీని యధావిధిగా నడపడం సాధ్యం కాదన్న అభిప్రాయంలో సమావేశంలో వ్యక్తమైంది. ఇక.. బేషరతుగా తమను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. కానీ.. సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పిస్తేనే.. ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో.. కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏదేమైనా.. రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు వెలువరించే తీర్పుపైనే.. ప్రభుత్వ నిర్ణయం ఆధారపడి ఉంది.
Read More : ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్