ఆర్టీసీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. రెండు నెలలుగా వేతనాలు లేకుండా సమ్మెలో కొనసాగుతున్న కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో విధుల్లో చేరతామంటూ రాష్ట్రంలోని వివిధ డిపోలకు కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చేవరకు విధుల్లోకి తీసుకోవద్దని డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీచేశారు అధికారులు. మరోవైపు ఆర్టీసీని నడపాలంటే నెలకు రూ. 640 కోట్లు కావాలని.. అంత శక్తి ప్రభుత్వం వద్ద లేదని సీఎం చేసిన వ్యాఖ్యలు కార్మికుల్లో కలవరం రేపుతున్నాయి. దీంతో వారి ఆశలన్నీ సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయంపైనే ఉన్నాయి.
ఇదిలావుంటే సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటనపై చర్చించారు ఆర్టీసీ జేఏసీ నేతలు. ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రానందున.. శనివారం సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు జేఏసీ నేతలు. సీఎం నిర్ణయం తర్వాతే సమ్మెపై స్పందించాలని ఆర్టీసీ జేఏసీ భావిస్తోంది. అంతవరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేసింది. అందులో భాగంగా సేవ్ ఆర్టీసీ పేరుతో డిపోల వద్ద, ప్రధాన కూడళ్లలో ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థారెడ్డి.
తమకు అనుకూలంగా సీఎం నిర్ణయం తీసుకుంటారా? లేక ప్రభుత్వ నిర్ణయానికే కట్టుబడి ఉంటారా..? అని తర్జనభర్జన పడుతున్నారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం స్పందించకుంటే.. సమ్మె యథాతథంగా కొనసాగిస్తామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించడంపై కార్మికుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read More : ఆర్టీసీ సమ్మె @ 50 రోజులు : కార్మికులను టి.సర్కార్ కరుణిస్తుందా