విజయవాడ: చంద్రబాబు లాంటి నాయకుడు శత్రువు కాని వ్యక్తితో శత్రుత్వం పెంచుకుంటున్నాడని, అనవసరంగా సీఎస్ తోగొడవ పెట్టుకుంటున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. జగన్ కేసుల వ్యవహారం అయ్యాక చంద్రబాబు నాయుడే ఎల్వీ కి పదోన్నతులు కల్పించారని గుర్తు చేశారు ఉండవల్లి. దేశంలో చంద్రబాబు కంటే రూల్స్ తెలిసిన వాళ్లు ఎవరూ లేరని మోడీ లాంటి సమ ఉజ్జీలతో పోటీ పడాలి కానీ సీఎస్ లాంటి వ్యక్తితో చంద్రబాబు గొడవలు పెట్టుకోవటం తగదని హితవు పలికారు. దేశ వ్యాప్తంగా మోడీ కి వ్యతిరేకంగా ప్రచారం చేసి జాతీయ స్ధాయిలో నాయకుడవ్వవచ్చని చెప్పారు. బ్యాడ్ను కూడా గుడ్ గా మార్చుకోగల సత్తావున్ననాయకుడు, కాస్త ఇరిటేషన్ తగ్గించుకుని వ్యవహరించాలని ఉండవల్లి చంద్రబాబుకు సూచించారు.
ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీహార్ లో ఏపీ, తెలంగాణ విభజనపై చేసిన వ్యాఖ్యలను ఉండవల్లి తప్పుపట్టారు. ఇక్కడ ప్రజల మధ్య గొడవలు లేవని, కేవలం రాజకీయ నాయకుల మధ్యే విబేధాలు ఉన్నాయని అన్నారు. కేంద్రం ఏపీకి అన్యాయం చేసింది అని ఆక్రోశించే నాయకులు ఒకసారి 2014 జనవరి 30 నాడు అసెంబ్లీ చేసిన తీర్మానం పై చర్చ పెడితే, మనకు జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యులు, ఆ సమస్య ఎలా తీరుతుంది అనేది తెలుస్తుందని చెప్పారు.