ఏపీ ఎస్‌ఈసీ(రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్)గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. సోమవారం(ఆగస్టు 3,2020) ఉదయం 11.15 గంటలకు విజయవాడలోని ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డను తిరిగి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ అని నిమ్మగడ్డ రమేష్ అన్నారు. రాగద్వేషాలకు అతీతంగా ఎస్‌ఈసీ పనిచేస్తుందని.. గతంలో మాదిరిగానే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు.
కాగా, నిమ్మగడ్డ రమేష్ కార్యాలయానికి స్వల్ప వాస్తు మార్పులు చేశారు. ఒకవైపు పూర్తిగా మూసివేశారు. మరోవైపు నుంచి చాంబర్‌లోకి ప్రవేశించేలా మార్పులు చేపట్టారు. ఇప్పుడీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. నిమ్మగడ్డ రమేష్ ఎపిసోడ్ ఏపీలో తీవ్రమైన రాజకీయ దుమారం రేపిన విషయం విదితమే. ఆయనను పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం, ఆయన కోర్టు మెట్లు ఎక్కడం, గవర్నర్ జోక్యం తదితర పరిణామలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వంతో తగాదాల నేపథ్యంలో నిమ్మగడ్డ సైతం వాస్తు మార్పులపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. వాస్తులో దోషాల కారణంగా ఈ సమస్యలు వస్తున్నాయని భావించారో మరో కారణమో కానీ, వాస్తులో మార్పులు చేశారు. మరి, ఈ వాస్తు మార్పులతో సమస్యలన్నీ తొలగిపోతాయా? ఇక ఆయన హాయిగా తన పని తాను చేసుకుపోతారా? అన్నది తెలియాల్సి ఉంది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్న రమేష్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని జగన్ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ క్రమంలోనే ఆయన పదవీకాలన్ని తగ్గించి కొత్త SECగా కనగరాజ్‌ను నియమించారు. ఏపీ ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో.. కోర్టు ఆర్డినెన్స్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అక్కడ కూడా ఎదురు దెబ్బ తగలడంతో.. నిమ్మగడ్డను తిరిగి ఎస్ఈసీగా నియమించారు.
హైకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను పునర్నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జూలై 30 అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఒక ప్రకటన జారీ చేశారు. గెజిట్ విడుదల చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు. దానికి అనుగుణంగా సోమవారం తిరిగి ఎస్ఈసీ బాధ్యతలు చేపట్టారు నిమ్మగడ్డ రమేష్.