విజయవాడ: వంగవీటి రాధా కృష్ణ టీడీపీలో చేరటానికి రంగం సిధ్దమైంది, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, రాధాను సోమవారం రాత్రి 12న్నర తర్వాత చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకు వచ్చారు. టీడీపీలో చేరిక పై రాధా చంద్రబాబు తో దాదాపు గంటకు పైగా చర్చలు జరిపారు. వంగవీటి రాధాకు మచిలీపట్నం పార్లమెంట్ టికెట్ ఇచ్చేఅవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ కి రాజీనామా చేసిన రాధా చాలాకాలంగా టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతూ వస్తోంది.
వైసీపీ కి రాజీనామా చేసిన తర్వాత, టీడీపీ లో చేరాలంటే విజయవాడలో సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న కొండప్రాంత వాసులకు ఇళ్లపట్టాలు మంజూరు చేయాలని రాధా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. రాధా పలు ప్రెస్ మీట్ లలో కూడా అదే డిమాండ్ చేస్తూ వచ్చారు. రాధా డిమాండ్ చేసిన కొన్నాళ్లకే ప్రభుత్వం కొండ ప్రాంత వాసులకు ఇళ్లపట్టాలు మంజూరు చేసింది. దీంతో తన తండ్రి చివరి కోరికను తీర్చిన పార్టీగా టీడీపీ ఉంది కనుక తాను టీడీపీ లో చేరేందుకు సిధ్దమయ్యానని తన కార్యకర్తలకు చెప్పినట్లు తెలిసింది. ఏది ఏమైనా చంద్రబాబు తో భేటీలో ఏఏ అంశాలు ప్రస్తావించారు, రాజకీయంగా ఎటువంటి హామీలు లభించాయనేది తెలియాల్సి ఉంది.