war of words between Ravi Shankar Prasad and Nitish kumar
Bihar: బిహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ యూనైటెడ్ చీఫ్ నితీశ్ కుమార్.. జాతీయ స్థాయి రాజకీయ ప్రయత్నాల్లో ఉన్న విషయం తెలిసిందే. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలతో కూటమి ఏర్పాటు చేసి, దానికి నాయకత్వం వహించాలనే ఉబలాటంలో ఉన్నారు. ఇందుకు జాతీయ స్థాయిలో ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని నడపలేని నితీశ్.. ప్రధాన మంత్రి అభ్యర్థి కావాలనుకుంటున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు.
అయితే నితీశ్ ప్రయత్నాలు సఫలం కావని, ఎందుకంటే దేశ ప్రజలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై పూర్తి విశ్వాసంతో ఉన్నందున, ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలంటూ రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. ఆదివారం ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. ‘‘మీ పార్టీలోనే లుకలుకలు ఉన్నాయి. మీరు దేశాన్ని ఏకం చేయడానికి బయల్దేరారు. రాష్ట్రాన్ని నడపలేని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తనను ప్రధాన మంత్రి అభ్యర్థిని చేయాలని కోరుతున్నారు. మీకు కాంగ్రెస్ చేయూతనివ్వదు’’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘నితీశ్ గారూ.. మీరు దేవె గౌడ, ఇందర్ కుమార్ గుజ్రాల్ మాదిరిగా అవుదామనుకుంటున్నారా?’’ అంటూ ప్రశ్నించారు.
Madhya Pradesh: శివరాత్రి వేడుకలో కుల కులాల మధ్య గొడవలు.. 14 మంది తీవ్ర గాయాలు
రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యపై నితీశ్ తీవ్ర స్థాయింలో స్పందించారు. దేశంలోని విపక్షాలన్నీ ఏకమైతే భారతీయ జనతా పార్టీ నిట్టనిలువునా పడిపోతుందని మండిపడ్డారు. ప్రతిపక్షాల ఐక్యత వల్ల సత్ఫలితాలు ఉంటాయని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వస్తే, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 100 కన్నా తక్కువ స్థానాలు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కలిసి రావాలని కాంగ్రెస్ పార్టీకి పిలుపునిచ్చారు. సాధ్యమైనంత త్వరగా ఈ కూటమికి రూపం ఇవ్వాలని నితీశ్ కోరారు.