బీజేపీలోకి వైసీపీ ఎంపీలు? ఏపీలో అసలు కమలం వ్యూహం ఏంటి?

  • Publish Date - July 11, 2020 / 04:24 PM IST

గ్రామ సచివాలయాలకు పార్టీ రంగులేసి ఎదురుదెబ్బలు తిన్న ఆ పార్టీ రంగు పేరు ఎత్తితేనే కంగారు పడిపోతోంది. ఏ రంగు అయినా కాషాయంలో కలిసిపోతుంది అంటూ బీజేపీ చేసిన కామెంటే ఈ కంగారుకు కారణం. దీంతో ఏపీ రాజకీయాలు కొత్త రంగు పులుముకున్నాయి. ఇంతకాలం టీడీపీ పసుపు రంగుపైనే కన్నేసిన బీజేపీ, ఇప్పుడు వైసీపీ మూడు రంగులపైన కూడా కన్నేసినట్టు కనిపిస్తోంది. ఓవరాల్ గా ఈ రంగుల వ్యవహారంలో బీజేపీ అసలు రంగు ఏంటో చూడాలి.

వైసీపీ, బీజేపీ మధ్య వార్:
ఏపీలో అధికార వైసీపీ, కేంద్రంలోని అధికార బీజేపీ మధ్య వార్‌ నడుస్తోంది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం నేపథ్యంలో రెండు పార్టీల మధ్య ట్వీట్‌ వార్‌ నడుస్తోంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌ ఇందుకు ఆజ్యం పోసింది. రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే వైసీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయనకు పార్టీ ద్వారా వివిధ కమిటీల్లో సంక్రమించిన పదవుల నుంచి తొలగించాలని కూడా కోరారు. ఇదే సమయంలో విజయసాయిరెడ్డి ఓ ట్వీట్‌ చేశారు. దీనికి సమాధానంగా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ దియోధర్‌ ఓ ట్వీట్‌ చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది.

పసుపునే కాదు ఏ రంగునైనా కాషాయం చేయగల సత్తా ఉంది:
ఒక్క పసుపు రంగునే కాదని.. ఏ రంగునైనా కాషాయం చేయగల సత్తా బీజేపీకి ఉందని దియోధర్‌ ట్వీట్‌ చేయడం దుమారం రేపుతోంది. రఘురామకృష్ణంరాజు ఫేడ్ చేస్తున్న రంగులను కాపాడుకోవాలంటూ విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ ఆయన పేర్కొనడం విశేషం. దియోధర్‌ ట్వీట్‌ వెనుక చాలా అర్థాలున్నాయని అంటున్నారు. ఇక్కడ పసుపు అంటే పరోక్షంగా టీడీపీని ఉద్దేశించేని స్పష్టం అవుతోంది. గతంలో టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్‌, గరికపాటి రామ్మోహన్‌రావుతో పాటు మరో ఎంపీ బీజేపీలో చేరారు.

బీజేపీలోకి వైసీపీ ఎంపీలు?
ఆ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన సునీల్ దియోధర్.. తాజాగా వైసీపీలో చిచ్చు రేపుతోన్న రఘురామకృష్ణంరాజు అంశాన్ని ప్రస్తావించారు. పరోక్షంగా మరికొందరు నేతలు రఘురామకృష్ణంరాజుతో కలసి కాషాయం కండువా కప్పుకొంటారేమోనన్న ప్రచారానికి ఆస్కారం ఇచ్చారు. రఘురామతో పాటు మరికొందరిని అవసరం అనుకుంటే తమ పార్టీలోకి తీసుకొచ్చే సత్తా ఉందని సునీల్‌ పరోక్షంగా వైసీపీని హెచ్చరించారని బీజేపీతో పాటు వైసీపీ నేతల్లో కూడా చర్చించుకుంటున్నారు. రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సుమారు 100 పేజీల ఫిర్యాదు ప్రతిని వైసీపీ ఎంపీలు స్పీకర్‌ ఓం బిర్లాకు అందజేశారు.

వైసీపీ నుంచి వలసలను ప్రోత్సహించేందుకు బీజేపీ ప్రయత్నం:
వైసీపీ తరఫున ఎన్నికైన రఘురామకృష్ణంరాజు.. వైసీపీలో ఉంటూ మిగిలిన ప్రతిపక్షాలతో మంతనాలు చేస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నది విజయసాయిరెడ్డి విమర్శ. ఏపీలో బలపడాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్లాన్‌ చేసుకుంటోంది. ఆ పార్టీలో నాయకులు చాలా మంది చేరుతున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో బలంగా ఉన్న వైసీపీ నుంచి కూడా వలసలను ప్రోత్సహించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అంటున్నారు. అందులో భాగంగానే రఘురామకృష్ణంరాజును వాడుకుంటోందని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. పార్టీ నుంచి ఇతర నేతలు జారుకోకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నారు. రఘురామకృష్ణంరాజుకు వ్యతిరేకంగా పోలీసు స్టేషన్లలో ఎమ్మెల్యేలతో ఫిర్యాదులు కూడా చేయిస్తున్నారు. మరి ఈ వ్యవహారం రఘురామ ఒక్కరితో ఆగుతుందా… ఇంకా ముందుకు వెళ్తుందా అన్నది వేచి చూడాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు