Neetu Singh on Flying Kiss: లోక్‌సభలో ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన ఆరోపణల వివాదం ఇప్పటికే రాహుల్ గాంధీని అతలాకుతలం చేస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు ఆయనను మరింత చిక్కుల్లో పడే విధంగా వ్యాఖ్యానించారు. బీహార్‌లోని హిసువా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నీతూ సింగ్ ఈ తాజా వివాదానికి దారి తీశారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే.. దేశంలో యువతులకు కొరత లేదని, అయితే 50 ఏళ్ల మహిళకు ఫ్లైయింగ్ కిస్ ఇవ్వాల్సిన అవసరం రాహుల్ గాంధీకి లేదని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అంతే కాకుండా, “ఫ్లయింగ్ కిస్” వివాదం రాహుల్ గాంధీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నమని ఆమె పేర్కొన్నారు. ‘‘మా నాయకుడు రాహుల్ గాంధీకి అమ్మాయిల కొరత లేదు. ఫ్లయింగ్ కిస్ ఇవ్వాలనుకుంటే అమ్మాయికి ఇస్తారు. కానీ స్మృతి ఇరానీ లాంటి 50 ఏళ్ల బుడ్డీ(వృద్ధురాలికి) ఎందుకు ఇస్తారు? రాహుల్ గాంధీపై ఈ ఆరోపణలు నిరాధారమైనవి” అని నీతూ సింగ్ అన్నారు. కాగా, సింగ్ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మండిపడింది. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా స్పందిస్తూ స్మృతి ఇరానీపై నీతూ సింగ్ చేసిన వ్యాఖ్యలను ‘సిగ్గుచేటు’ అని పేర్కొన్నారు. మరో నేత షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ, కాంగ్రెస్ ‘మహిళా వ్యతిరేక పార్టీ’ అని, దాని నాయకుడు రాహుల్ గాంధీని రక్షించడానికి అది ఎంతవరకైనా వెళ్లగలదని దుయ్యబట్టారు.
లోక్‌సభలో బుధవారం రాహుల్ గాంధీ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారంటూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతే కాకుండా ఆయనను స్త్రీ ద్వేషి అని అభివర్ణించారు. సభలో ఇలాంటి “అసభ్యకరమైన చర్య” ఎప్పుడూ చూడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ మహిళా ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమై రాహుల్ గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 20 మందికి పైగా మహిళా పార్లమెంటేరియన్లు సంతకం చేసిన ఫిర్యాదులో, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభలో మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ సభ్యుడు ఇరానీ పట్ల “అనుచితమైన సంజ్ఞ” చేశాడని ఆరోపించారు.