సడెన్‌గా సైలెంట్ అయిన వైసీపీ ఫైర్ బ్రాండ్, కారణం అదేనా?

  • Publish Date - July 16, 2020 / 04:22 PM IST

ఆ మంత్రిగారి మాటల్లో కావల్సినన్ని పంచ్ లు ఉంటాయి. కావాలనుకుంటే బూతులూ ఉంటాయి. చంద్రబాబుని చెడుగుడు ఆడాలంటే ఆయన తర్వాతే ఎవరైనా అని అభిమానులు కీర్తిస్తుంటారు. ఇంతకాలం మైకుల ముందు వెనుకాముందు చూసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడిన ఆయన ఇప్పుడు మౌనవ్రతం పాటిస్తున్నారు. ఇంతకీ ఆయన నోటికి బ్రేక్ వేసింది ఎవరు?

టీడీపీ విమర్శలకు ఆయనిచ్చే కౌంటర్లు సూపర్ హిట్:
కొడాలి నాని… వైసీపీ ఫైర్ బ్రాండ్. అప్పటి ప్రతిపక్షంలోనూ.. ఇప్పుడు అధికారంలోనూ ఆయన స్టైలే వేరు. అసలే ఫైర్‌కి తోడు మంత్రి పదవి ఇవ్వడంతో మరింతగా టీడీపీపై నిప్పులు కురిపించారు. సీఎం జగన్, ప్రభుత్వంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు… ఆయన ఇచ్చే కౌంటర్లు సూపర్ హిట్టయ్యేవి. ప్రజావేదిక కూల్చివేత, రాజధాని రైతులు, అమరావతిలో జరిగే సంఘటనలతో పాటు రాష్ట్ర రాజకీయాలపైనా కొడాలి నాని తెలుగు తమ్ముళ్లపై విరుచుకుపడేవారు. ముఖ్యంగా చంద్రబాబును చెడుగుడు ఆడాలంటే ఆయన తర్వాతే ఎవరైనా.

నిమ్మగడ్డ ఇష్యూ నుంచి తగ్గిన స్పీడ్:
కీలక విషయాల్లో టీడీపీకి గట్టి కౌంటర్ ఇచ్చే కొడాలి నాని… గత కొన్ని రోజులుగా సైలెంట్ అయ్యారు. నిమ్మగడ్డ ఇష్యూ నుంచి కొడాలి స్పీడ్ మొత్తం తగ్గించేశారు. దీంతో నాని మౌనంపై పొలిటికల్ సర్కిల్స్‌లో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నాని అసంతృప్తిగా ఉన్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీనికితోడుగా ప్రభుత్వంపై విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేస్తున్నా.. కొడాలి నాని ఎలాంటి కౌంటర్ ఇవ్వకపోవడంతో… ఆయనెందుకు సైలెంటయ్యారా అనే అనుమానాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

నాని మౌనానికి కారణమిదే:
మరోవైపు కొడాలి నాని మౌనం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్నారు ఆయన సన్నిహితులు. పార్టీ, ప్రభుత్వం, సీఎం జగన్‌పై… నానికి ఎలాంటి అసంతృప్తి లేదని చెప్తున్నారు. గుడివాడలో ఇప్పటికే మూడుసార్లు గెలిచిన నాని… అక్కడ ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండడంతో పాటు స్థానిక సమస్యల పరిష్కారంపైనే దృష్టి పెట్టారంటున్నారు. శాఖపరమైన కార్యకలాపాలు కూడా అక్కడ్నుంచే నిర్వహిస్తున్నట్లు చెప్తున్నారు. సోషల్‌ మీడియాలో కావాలనే కొందరు నానిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కొట్టిపడేస్తున్నారు. అవసరం అయినప్పుడు సచివాలయం, సీఎం క్యాంప్ కార్యాలయానికి వస్తున్నారని… తన స్థాయిలో ప్రెస్‌మీట్లు పెట్టి టీడీపీకి కౌంటర్ ఇచ్చే అవసరం రాలేదంటున్నారు కొందరు పార్టీ నేతలు.

మొత్తానికి నాని మౌనం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవన్నది ఆయన సన్నిహితుల వెర్షన్‌. కానీ, పొలిటికల్‌ సర్కిల్స్‌లో మాత్రం రూమర్స్‌ కంటిన్యూ అవుతున్నాయి. వీటికి బ్రేక్‌ పడాలంటే కొడాలి నాని.. మరోసారి నోటికి పని చెప్పాలేమో.